పరిగి, ఏప్రిల్ 1 : రాష్ర్టాన్ని పరిపాలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్లని బీసీ, ఎస్సీ, ఎస్టీ రాజ్యాధికార జేఏసీ కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహరాజ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. వీరు చేస్తున్నది ముఖ్యమంత్రి గిరి కాదు, ఎమ్మెల్యే గిరి కాదు.. వీళ్లు దళారులు, ల్యాండ్ బ్రోకర్లని దుయ్యబట్టారు. వేలాది ఎకరాలు పేదల భూములు కొల్లగొట్టి పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసే భయంకరమైన కుట్రలో భాగంగా లగచర్లలో, ఖమ్మంలో, మరోచోట చేస్తున్న భూ దందాలని మండిపడ్డారు. బుధవారం పరిగి మండలం కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్కులకు తమ భూములు ఇచ్చేది లేదని నిరాహారదీక్ష చేస్తున్న రైతులకు విశారదన్ మహరాజ్ సంఘీభావం ప్రకటించారు.
పేదల భూములు కొల్లగొట్టి..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల భూములను కొల్లగొట్టి పెద్దలకు పంచే పని ముఖ్యమంత్రి చేస్తున్నారన్నారు. తిండిలేని, తరతరాల నుంచి తమ రక్త మాంసాలను భూమికి అర్పితం చేసి, వారికి గుర్తుగా ఉన్న పేదల భూమి ఒక్కటే ముఖ్యమంత్రికి కనబడిందా అని ప్రశ్నించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి తెలంగాణలో ప్రభుత్వ భూములు, పెద్దల భూములు లేవా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇలాంటి నికృష్టపు చేష్టలతో సీఎంకు పాపం తగలదా అని ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కులాల వారికి చెందిన భూములే దొరికాయా, ఇదేనా ఇందిరమ్మ పరిపాలన అని మండిపడ్డారు. పెద్దోళ్లది, ప్రభుత్వ భూములు లక్ష ఎకరాల భూమి తాను చూపిస్తానని, ఆ భూములు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమాయకులు, వారు తిరుగుబాటు చేయలేరనే పేదల భూములు లాక్కొంటున్నారని పేర్కొన్నారు. ఇది కాళ్లాపూర్ కాదని, మీ కాళ్లు విరగ్గొట్టి, మీ రాజ్యాన్ని సమాధి చేయడానికి బయలుదేరే యుద్ధానికి సిద్ధమవుతున్న గ్రామమన్నారు.
ప్రజాస్వామ్యయుతంగా పోరాటం
ఖమ్మంలో పేదలకు సంబంధించి 750 మంది ఇళ్ల స్థలాలు గుంజుకుంటే యుద్ధం చేస్తే వారికి పట్టాలివ్వడానికి ప్రభుత్వం సిద్ధమై ఇప్పటికే 300 మందికి పట్టాలిచ్చిందన్నారు. పేదవారి దగ్గర భూములు లాక్కోవడానికి మనసు ఎలా ఒప్పిందని ప్రశ్నించారు. ప్రభుత్వం లావణి పట్టాలతో రకరకాల రూపంలో పేదలకిచ్చిన భూములు గుంజుకోవాలని చూస్తున్నదన్నారు. ఆఖరికి చాకలివారి భూమి సైతం లాక్కోవాలని చూస్తున్న మీకు సిగ్గు, శరం ఉన్నదా అని మండిపడ్డారు. శ్మశానానికి, పార్కుకు, గ్రామంలో ఏదైనా అభివృద్ధికి, బిల్డింగ్లు కట్టడానికి ఎస్సీ, ఎస్టీల భూములే తీసుకుంటున్నారన్నారు. ఈ భూములను కాపాడుకోవడానికి రాహుల్‌గాంధీని కలిసేందుకు ఢిల్లీకి పాదయాత్రకు సిద్ధం కావాలన్నారు. అవసరమైతే గ్రామమంతా ఆమరణ దీక్ష చేపట్టేందుకు కార్యాచరణను ప్రకటిద్దామన్నారు. భూముల కోసం మీ పోరాటం ఆగొద్దని, అంగుళం భూమి పోకుండా నా గుండెలు అడ్డం పెడతానని భరోసా కల్పించారు. సమ్మక్క, సారక్క, చాకలి ఐలమ్మల స్పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా పోరాటం కొనసాగిద్దామన్నారు.
భూములు గుంజుకుంటే రాజకీయ సమాధే..
భూములు గుంజుకున్న వారికి ప్రజలు రాజకీయ సమాధి కట్టారని, ఇక్కడ అదే జరుగుతుందన్నారు. ఈ గ్రామ భూ బాధితుల దుఃఖం చూసి నా కళ్లలో నీళ్లు తిరిగి ఇక్కడి వరకు వచ్చానన్నారు. ఎవరికి దండం పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వమే దిగి వచ్చి మీ భూములు తీసుకోబోమని ప్రకటించేలా పోరాటం చేద్దామన్నారు. ఎక్కడా లొంగొద్దని, సమష్టిగా పోరాటం కొనసాగిద్దామని తెలిపారు. అనంతరం ఇండస్ట్రియల్ పార్కు పేరిట ప్రభుత్వం చేయనున్న భూ సేకరణలో కోల్పోతున్న భూములను విశారదన్ మహరాజ్ పరిశీలించారు. కార్యక్రమంలో కాళ్లాపూర్ సర్పంచ్ పుల్లయ్య, కాళ్లాపూర్, రాపోల్ నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేందర్, కార్యదర్శి బాలయ్య, నాయకులు, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీందర్, తెలంగాణ జాగృతి నాయకులు పాల్గొన్నారు.
భూములు లాక్కోవద్దు
ఇండస్ట్రియల్ పార్కు పేరిట తమ విలువైన భూములు లాక్కోవద్దంటూ పరిగి మండలం రాపోల్ గ్రామ రైతులు బుధవారం పరిగి-షాద్‌నగర్ రహదారిపై రాస్తారోకో చేశారు. రోడ్డు మధ్యలో కట్టెలు వేసి మంటలు పెట్టి రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ భూములను లాక్కోవద్దని అధికారులందరికీ విన్నవించినా ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదని రైతులు వాపోయారు. తమ కుటుంబాలకు జీవనాధారమైన భూములను లాక్కుంటే తాము బతికేదెలా అని ప్రశ్నించారు. భూ సేకరణను నిలిపివేస్తున్నట్లు సర్కారు వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూ సేకరణను ఉపసంహరించుకునేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు హెచ్చరించారు.
రైతులు చాలా సమయం వరకు రోడ్డుపై రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని రైతుల నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. తమ భూములు పోయి ఆందోళన చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను అన్నదాతలు ప్రశ్నించారు. రైతులు అలాగే రోడ్డుపై బైఠాయించగా పోలీసులు సముదాయించి తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడించారు. మీ సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకువెళ్తానని తహసీల్దార్ చెప్పగా.. అన్నదాతలు తమ ఆందోళన విరమించారు.