కులకచర్ల, సెప్టెంబర్ 19 : అసలే వర్షాకాలం.. పంచాయతీల్లో పరిసరాలు కంపు.. కంపుగా ఉండడంతో దోమలు ప్రబలి..ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. స్థాని కంగా ఉన్న ప్రైవేట్ వైద్యుల వద్దకు వెళ్తే.. వచ్చిరాని వైద్యంతో వారు రోగుల ప్రాణా లతో చెలగాటం ఆడుతున్నారు. ఎలాంటి అనుమతుల్లేకుండా సంపాదనే ధ్యేయం గా వెలుస్తున్న క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.
సీజనల్ వ్యాధులు ప్రబలడంతో గ్రామాల్లోని ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. ప్రభుత్వ దవాఖానలు దూరంగా ఉండడంతో రోగులు స్థానికంగా ఉన్న ప్రైవేట్ వైద్యులను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సంపాదనే ధ్యేయంగా ఎలాంటి అనుమతుల్లేకుండా వెలుస్తున్న క్లినిక్‌లు, ల్యాబ్లకెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు. టెన్త్ కూడా పాస్ కాని వారు కొంతమంది రాజకీయనాయకుల అండదండలతో క్లినిక్‌లను ఏర్పాటు చేసి వైద్యులుగా చెలామణి అవుతు న్నారు. అన్ని వ్యాధులకు ఒకే విధమైన చికిత్స చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మండలంతోపాటు చౌడాపూర్ మండల కేంద్రంలో కొందరు ఎలాంటి అనుమతుల్లేకుండా క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆర్ఎంపీ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను నిర్వహించాలంటే వైద్యశాఖ నుంచి అనుమతి పత్రాలు తీసుకోవాలి. వైద్యానికి వచ్చిన వారికి తగిన సూచనలు మాత్రమే ఇవ్వాలి. కానీ, ఆర్ఎంపీ వైద్యులు మాత్రం తమకు ఇష్టం వచ్చినట్లు సీనియర్ వైద్యులుగా వ్యవహరిస్తూ అన్ని రోగాలకు మందులు రాస్తున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ల ఏర్పాటుతోపాటు వారే సొంతంగా మెడికల్ షాపులను నిర్వహిస్తూ పేదల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. జ్వరం, టైఫాయిడ్, డెంగీ, మలేరియా, చికున్‌గున్యాలతోపాటు అనేక రకాల వ్యాధులకు సంబంధించిన టెస్టులు కూడా చేస్తున్నారు.
జ్వరం వచ్చిందని ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్తే మినీమం రూ. రెండు నుంచి రూ. మూడు వేల వరకు ప్రజల నుంచి దండుకుంటున్నారు. ఎలాంటి అనుభవం, అర్హత లేకుండా డయాగ్నోస్టిక్ సెంటర్లను కొనసాగిస్తున్నారు. చౌడాపూర్ మండల కేంద్రంలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఇంటర్ చదువుతున్న విద్యార్థి నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని రాజకీయనాయకుల అండదండలతో బెదిరిస్తున్నారు. కాగా కొందరు హెల్త్అసిస్టెంట్లు కూడా ప్రైవేట్ క్లినిక్‌లను ఏర్పాటు చేసుకొని వైద్యం అందిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
డీఎంహెచ్‌వో ఆదేశాల మేరకు బుధవారం చౌడాపూర్ మండల కేంద్రంలో జిల్లా అధికారులు పలు క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై దాడులు చేసి సీజ్ చేశారు. వాటిలో ఎస్కే, మదిహా డయాగ్నోస్టిక్ సెంటర్లు, మదిహా క్లినిక్, రాజ్యలక్ష్మి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, షిఫ క్లినిక్‌లున్నాయి. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో పాల్వన్‌కుమార్ మాట్లాడుతూ అనుమతి లేకుండా క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
చౌడాపూర్ మండలంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఐదు క్లినిక్‌లు, డయా గ్నోస్టిక్ సెంటర్లను అధికారులు సీజ్ చేశారు. ప్రాథమిక చికిత్స నిర్వహించాల్సిన ఆర్ఎంపీలు అన్ని రకాల వైద్యం అందిస్తున్నారని అధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు వారు దాడులు చేసి వాటిని సీజ్ చేశారు.
– డాక్టర్ వాజిహుద్దీన్, కులకచర్ల మండల వైద్యాధికారి