చేవెళ్లటౌన్, అక్టోబర్ 13 : కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వేదికపైకి పిలువలేదంటూ కాంగ్రెస్ అధిష్ఠానం ఎదుట చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుల ఎన్నిక సందర్భంగా సోమవారం చేవెళ్లలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తల అభిప్రాయాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పరిశీలకులుగా తమిళనాడు ఎంపీ రాబర్ట్ బ్రూస్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, పీసీసీ ఉపాధ్యక్షులు వినయ్‌రెడ్డి, విజయరెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి హాజరయ్యారు.
ఈ కార్యక్రమం చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామెన భీమ్ భరత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం భీమ్ భరత్ వర్గం, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. తనకు మీటింగ్‌కు సంబంధించి సమాచారం ఇవ్వకపోగా, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుల ఎన్నికకు సంబంధించి 15 మంది పేర్లు రాసివ్వగా కొంత మంది పేర్లు మాత్రమే చదవడంతోపాటు తనను వేదిక పైకి ఎందుకు పిలువలేదని చేవెళ్ల పట్టణ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ బీసీలకిచ్చిన 42 శాతం రిజర్వేషన్ ప్రకారం న్యాయం చేయరా అంటూ ప్రశ్నించారు. వేదికపై డమ్మీ బీసీలను కూర్చోబెట్టారంటూ మండిపడ్డారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జూకన్నగారి శ్రీకాంత్‌రెడ్డి సైతం వాదనకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ఇంతకు ఏ పార్టీ? అధికారిక సమావేశాలకు తమను ఎందుకు ఆహ్వానించడంలేదని శ్రీకాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు నువ్వు ఏం చేశావంటూ శ్రీనివాస్‌గౌడ్ శ్రీకాంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు. దీంతో కొంతసేపు నాయకుల మధ్య గందరగోళం ఏర్పడగా.. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి కలుగజేసుకొని గొడవను శాంతింపచేశారు. సమావేశం అనంతరం స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య సమావేశం ఏర్పాటు చేసిన స్థలానికి వచ్చి ముఖ్య నాయకులను కలిసి వెళ్లిపోయారు.