భూములే.. మా జీవనాధారం. అవి లేకుంటే మేము ఎలా బతకాలి.. ఎక్కడికెళ్లాలని దుద్యాల ప్రాంత ఫార్మా భూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సారవంతమైన భూములు.. ఆశించిన మేర పంటలతో సంతోషంగా బతుకుతున్నామని..తమ భూముల్లో ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలియడంతో గత ఎనిమిది నెలలుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నామని కన్నీటి పర్యంతమవుతున్నారు. కాలుష్య కారక ఫార్మా కంపెనీలకు తమ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వబోమని, సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ తమ పోరాటం ఆగదని స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ ఫార్మా కంపెనీలు వద్దే..వద్దని ఎంత మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, డ్రోన్ల ద్వారా రహస్యంగా సర్వేలు చేయిస్తూ ఆందోళనకు గురిచేస్తున్నదని మండిపడుతున్నారు.
-కొడంగల్, నవంబర్ 4
గిరిజనుల భూములపై సర్కారు కన్నేసిందని..వాటిని లాక్కోవాలని చూస్తున్నదని పలువురు మండిపడుతున్నారు. దుద్యాల మండలంలోని రోటిబండతండా, పులిచెర్లకుంట తండాల్లో దాదాపుగా 102 గిరిజన కుటుంబాలుండగా 450 వరకు జనాభా ఉన్నది. ఇక్కడ తాము చదును చేసి, సాగు చేసుకుని జీవిస్తున్న భూములను తీసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఫార్మా కంపెనీలకు ఇవ్వబోమని.. అవసరమైతే సర్కార్‌తో పోరాడుతామని వారు తేల్చిచెబుతున్నారు. తమ బతుకులు బాగుచేస్తారని రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ..సీఎం అయిన ఆయన ఫార్మాకంపెనీలను తీసుకొచ్చి తమ బతుకులను ఆగం చేయాలని చూస్తున్నారని మండిపడుతున్నారు.
మొత్తం కాలుష్యమయం అవుతుంది..
రోటిబండతండా, పులిచెర్లకుంట తండాల్లో అసైన్డ్ ల్యాండ్ 80 ఎకరాలు మాత్రమే ఉండగా.. ఫార్మా కం పెనీల ఏర్పాటుకు ఆ 80 ఎకరాల భూమితోపాటు గిరిజనులకు సంబంధించిన 500 ఎకరాలను ప్రభుత్వం లాక్కునేందుకు యత్నిస్తున్నదని గిరిజన రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల ధర ఎకరానికి రూ.70 నుంచి రూ. కోటి వరకు పలుకుతు న్నా.. ఏ ఒక్క గిరిజన రైతు కూడా తమ భూములను విక్రయించేందుకు సిద్ధంగా లేరంటే ..ఆ పొలాలపై వారికి ఎంత మక్కు వ ఉందో ప్రభుత్వం ఒక్కసారి గుర్తించాలని సూచిస్తున్నారు.
పైన పేర్కొ న్న రెండు తండాలతోపాటు దుద్యాల, లగచర్ల, ఈర్లపల్లి గ్రామాల్లో ప్రభుత్వ భూమి 252 ఎకరాలు మాత్రమే ఉందని.. ఫార్మా విలేజ్ ఏర్పాటుకు ప్రభుత్వం 1,375 ఎకరాలు సేకరిస్తున్నదని…అంటే ఈ లెక్కన దాదాపుగా వెయ్యి ఎకరాలకు పైగా పట్టా భూమిని ఫార్మా విలేజ్ కబళిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాతల కాలం నుంచి వస్తున్న భూములు, తమ కష్టార్జితంతో ఎకరం, రెండెకరాల భూములను కొనుగోలు చేసి తమ పిల్లలకు కాకుండా ప్రభుత్వానికి ఇవ్వాలని పేర్కొనడం తగదని..తమ పొలాలను సర్కారుకు ఇస్తే తమ సంతానం ఎలా జీవించాలని ప్రశ్నిస్తున్నారు. ఫార్మా కంపెనీలొస్తే ఈ ప్రాంతం మొత్తం కాలుష్యమయం అవుతుందని, అప్పుడు మనుషులతోపాటు పశువులు కూడా జీవించలేని పరిస్థితి వస్తుందని ఆందోళన వ్య క్తం చేశారు.
రూ. కోట్ల విలువైన భూములు..రూ. 10లక్షలకేనా..?
ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరానికి రూ.70 లక్షల నుంచి రూ. కోటి వరకు పలుకుతున్నది. ప్రభుత్వం రూ.పది లక్షలు, 125 గజా ల ఇంటి స్థలం, ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. భూములు ఇవ్వమంటే ఎలా..?. అయినా తాము భూములు అమ్ముకునేందుకు సిద్ధం గా లేము. భూములను నమ్ముకునే తాతల కాలం నుంచి బతుకుతున్నాం. వ్యవసాయం తప్ప వేరే వృత్తి తెలియదు.
-పాండ్యానాయక్, ఫార్మా భూబాధిత రైతు, పులిచెర్లకుంటతండా, దుద్యాల
రేవంత్‌రెడ్డి.. మా బతుకులను రోడ్డు పాలు జేస్తున్నారు..
అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డిని గెలిపించేందుకు మహారాష్ట్రలో ఉన్న ఈ ప్రాంత వలస కూలీలైన గిరిజనుల ఓట్లను వేయించా. ఆయన విజయం కోసం నిద్రాహారాలు మాని కష్టపడ్డా. కానీ, ఆయన సీఎం అయిన తర్వాత మా బతుకులనే రోడ్డు పాలు చేయాలని చూస్తున్నారు. -విఠల్‌నాయక్, ఫార్మా భూబాధిత రైతు, పులిచెర్లకుంట తండా, దుద్యాల
ప్రభుత్వం వినడం లేదు..
ఫార్మా కంపెనీలు వద్దే..వద్దని ఎంత మొత్తుకుంటున్నా, వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మా కున్న ఎకరం, రెండు ఎకరాల భూములు ఫార్మాకు పోతే, మేం ఎలా బతకాలి. భూములు ఇవ్వాలని మీటింగ్‌లు పెట్టి మాకు ఆశపెడుతున్నారు. మేము మాత్రం మా భూములను ఫార్మా విలేజ్‌కు ఇచ్చే ప్రసక్తేలేదు.
-సోమ్లానాయక్, ఫార్మా భూ బాధిత రైతు,పులిచెర్లకుంట తండా, దుద్యాల
భూములే.. మా జీవనాధారం
పనికి రాని బీడు భూములు, గుట్టలు, జనాలు లేని ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలి. పచ్చటి పంటలు పండే పట్టా భూములను తీసుకొని, కాలుష్యకారక కంపెనీలను ఏర్పాటు చేస్తామనడం విడ్డూరంగా ఉన్నది. మా తాతల నుంచి భూము లపైనే ఆధారపడి జీవి స్తున్నాం. మా జీవనాధా రం భూములే.. వాటిని వదిలి మేము జీవిం చలేం.
-గోపాల్‌నాయక్, ఫార్మా భూ బాధిత రైతు, పులిచెర్లకుంట తండా, దుద్యాల