తాండూరు నియోజకవర్గంలో మొదట్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి-ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మధ్య లోలోపల కోల్డ్‌వార్ జరిగినప్పటికీ ప్రస్తుతం బాహాటంగానే తమ బలమేంటో చూపించుకుంటున్నారు. ఇటీవల తాండూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు విచ్చేసిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఎదుట ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల మధ్య లుకలుకలు బయటపడ్డాయి. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి ఫొటో లేదంటూ, ప్రొటోకాల్ పాటించడం లేదంటూ డిప్యూటీ సీఎం ఎదుటే ఆయన వర్గం వాగ్వాదానికి దిగారు.
మహేందర్‌రెడ్డి అండతోనే మనోహర్‌రెడ్డి గెలిచాడనే ప్రచారం ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య మాత్రం కోల్డ్‌వార్ మొదటి నుంచి కొనసాగుతుండటం గమనార్హం. అనూహ్యంగా తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ పొంది ఎమ్మెల్యేగా గెలుపొందిన బుయ్యని మనోహర్‌రెడ్డి తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్‌లో తనదైన ముద్ర వేసేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నారు. అయితే ఎలాగైనా తాండూరు నియోజకవర్గంలో పాగా వేసేందుకు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు.
– వికారాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)
తాండూరు నియోజకవర్గంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని తాండూరు నియోజకవర్గ ప్రజలు మరిచిపోయేలా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే పార్టీ కార్యక్రమం, అధికారిక కార్యక్రమం జరిగినప్పటికీ సమాచారం ఇవ్వకపోవడం, ఒకవేళ ఎమ్మెల్సీ కార్యక్రమానికి హాజరైనా ఆయన ఫొటో లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో తాను లేదా తన తమ్ముడు తప్పా మూడో వ్యక్తి పోటీలో ఉండకూడదనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే మనోహర్‌రెడ్డి పావులు కదుపుతూ తాండూరు నియోజకవర్గానికి మహేందర్‌రెడ్డిని దూరం చేస్తున్నట్లు ప్రచారం జోరందుకున్నది. మరోవైపు తాండూరు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ మధ్య వర్గపోరు ఆ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.
సాక్షాత్తు సీఎం జిల్లాలో గ్రూపు రాజకీయాలు ఉండటంపై రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే కంటే ముందే కార్యక్రమాల్లో పాల్గొంటూ హల్చల్ చేసిన మహేందర్‌రెడ్డి సైలెంట్ అయ్యారనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఎప్పటికైనా తనకు రాజకీయంగా ప్రమాదమేనని గుర్తించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మహేందర్‌రెడ్డి వర్గానికి చెక్ పెట్టినట్లు టాక్ నడుస్తున్నది. పార్టీ కార్యక్రమాలతోపాటు అధికారిక కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్సీతోపాటు ఆయన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వవద్దని అధికారులకు కూడా ఎమ్మెల్యే చెప్పినట్లు సమాచారం.
ఎమ్మెల్సీ వర్గం అధికారుల వద్ద ఏదైనా పనులకు వెళ్లినా ఆ పనులు చేయకూడదని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే చెబుతున్నట్లు తెలిసింది. ఇటీవల తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ నిధుల కింద రోడ్డు పనుల మంజూరుకు సంబంధించి పెట్టిన ఫైల్‌ను ఎమ్మెల్యే రద్దు చేయించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నేరుగా ఎమ్మెల్సీకే ఎమ్మెల్యే ఢీ అంటూ ఢీ అనేలా చెక్ పెడుతుండడడంతో ఎమ్మెల్సీ వర్గం ఒక్కొక్కరు ఎమ్మెల్యేకు దగ్గరవుతున్నట్లు ప్రచారం.
ఎన్నికలు వచ్చేందుకు మరో మూడేళ్లు ఉండటంతో అప్పటివరకు స్థానికంగా పనులు కావాలంటే ఎమ్మెల్యే వర్గంలో చేరాలని ఒక్కొక్కరు మహేందర్‌రెడ్డికి హ్యాండిస్తున్నారు. తన వర్గం నాయకులు ఒక్కొక్కరు ఎమ్మెల్యే వర్గంలో చేరుతుండడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఎమ్మెల్సీ ఉన్నారు. తన ఉనికిని కాపాడుకునేందుకు ఏ కార్యక్రమం జరిగినా ప్రొటోకాల్ పాటించకపోయినప్పటికీ ఎమ్మెల్సీ పాల్గొంటున్నట్లు స్థానికంగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ ఊపందుకున్నది. ఇటీవల జరిగిన విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలోనే కాకుండా గతంలోనూ యాలాలలో జరిగిన డీసీసీబీ బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ ప్రొటోకాల్ పాటించకుండా ఎమ్మెల్సీకి కనీసం సమాచారం ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి.
తాండూరు నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ వస్తుందనే దానిపై వర్గపోరు మొదలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారనే చర్చ జరుగుతున్నది. పరిగి నుంచి టికెట్ ఆశించి చివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన మనోహర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసేలా ఇప్పటి నుంచే తాండూరు కాంగ్రెస్‌లో పావులు కదుపుతున్నారనే ప్రచారం ఊపందుకున్నది.
తనకు పోటీగా మరొకరు ఉండొద్దనే ఉద్దేశంతోనే మహేందర్‌రెడ్డి వర్గానికి పూర్తిగా చెక్ పెడుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జోరందుకున్నది. తన తమ్ముడిని పోటీకి దింపేందుకు కూడా ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు తాండూరు నియోజకవర్గంలో తనకంటూ కేడర్‌ను ఏర్పాటు చేసుకున్న పట్నం మహేందర్‌రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఆయన లేదా కుటుంబసభ్యులే పోటీ చేస్తారనే ప్రచారాన్ని ఆయన వర్గం చేస్తుండటం గమనార్హం. ఇందుకోసమే తాండూరులో ఏ కార్యక్రమం జరిగినా పాల్గొంటున్నారు.