కందుకూరు, మే 8: ఈ నెల 20న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను (General Strike) విజయవంతం చేయాలని సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు. కందుకూరు మండలం లేమూరులో ఆశా వర్కర్లతో కలిసి సీఐటీయూ కార్యదర్శి బుట్టి బాల్రాజ్ వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులపై పని భారాన్ని మోపుతున్నదని, వేతనాలు పెంచకుండా కార్మికులకు సంబంధించిన 29 చట్టాల నిర్వీర్యం చేస్తున్నదని విమర్శించారు.
పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే చట్టాలను తీసుకువచ్చి కార్మికుల బతుకులతో చెలగాటం ఆడుతుందన్నారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యోగ భద్రత కోసం దేశ వ్యాప్తంగా ఈ నెల 20న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. లేబర్ కోడ్ నంబర్ 4ను రద్దు చేయాలని, కార్మికులకు ఈఎస్ఐపీఎఫ్, రిటైర్మెంట్ డెన్సిటీ ఇవ్వాలని, రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం సీఐటీయూ మండల కన్వీనర్ శేఖర్, ఆశా వర్కర్లు సుశీల, సంధ్య, పోచమ్మ, లక్ష్మమ్మ, భారతి, చంద్రకళ పాల్గొన్నారు.