కడ్తాల్, జనవరి 19 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకవచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్ధు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పెంటయ్య డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన నాలుగు లేబర్కోడ్లు, 2025-జాతీయ విత్తన విద్యుత్ సవరణ బిల్లును రద్ధు చేయాలని డిమాండ్ చేస్తూ..రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా, రైతు, కార్మిక, వ్యవసాయ వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరిస్తుందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలకు కేంద్రం వెన్నుదన్నుగా ఉంటూ ఇప్పటి వరకు రూ.15 లక్షల కోట్ల రాయితీని ఇచ్చిందని విమర్శించారు. అదే విధంగా రాష్ట్రంలో అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు గడుస్తున్న కార్మికుల సమస్యలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. తెలంగాణలోని కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.
నాలుగు లేబర్కోడ్లను రద్ధు చేయాలని ఫిబ్రవరి 12న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. అనంతరం కార్మికుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ తహసీల్దార్ జయశ్రీకి సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు రమేశ్, జనార్ధన్, రమేశ్, కృష్ణ, నర్సయ్య, జంగయ్య, యాదయ్య, అంజయ్య, కృష్ణయ్య, మల్లేశ్, రఘుపతి, లక్ష్మయ్య, లక్పతి తదితరులు పాల్గొన్నారు.