చేవెళ్ల రూరల్, మే 10 : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆరు గ్యా రెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నది. గతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా ఇవ్వాల్సిన సబ్సిడీతో కూడిన రుణాలిచ్చే పథకాన్ని కొత్తగా రాజీవ్ యువ వికాస్ పథకంగా పేరు మార్చి.. అసలైన లబ్ధిదారులకు ఇవ్వకుండా సవాలక్ష కొర్రీలు పెడుతున్నది. తాజాగా రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించి మండల అభివృద్ధి అధికారులు సంబంధిత శాఖలు, బ్యాంకర్లతో సమావేశం ఏర్పా టు చేసి దరఖాస్తుదారుల సబిల్ స్కోర్ చెక్ చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంపై లబ్ధిదారుల్లో గందరగోళం నెలకొన్నది.
బ్యాంకు సిబిల్ స్కోర్ ఆధారంగా అర్హుల ఎంపిక జరిగితే నిరుపేదలకు పథకం అందనట్లే అని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిబిల్ స్కోర్ మంచిగా ఉన్నవారు అనునిత్యం బ్యాంకు లావాదేవీలు అధికంగా సాగించే వారే ఉంటారు కాబట్టి వారికే మొదటి ప్రాధాన్యత కల్పించేందుకు బ్యాంకులు రుణం ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయని తెలుస్తున్నది.
ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేక.. ఏదో ఒక కొర్రీ పెడుతూ కొంతమందికే ఇచ్చి చేతులు దులుపుకోవాలని సర్కారు చూస్తున్నదని పలువురు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.