కడ్తాల్, ఆగస్టు 20 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సీఐ గంగాధర్ కోరారు. బుధవారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని ఏక్వాయిపల్లి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు, గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు జనిగెల మహేశ్యాదవ్ రూ.50 వేల విరాళాన్ని సీఐకి అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలిపారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో అసాంఘిక కార్యాకలాపాలను, నేరాలను అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్న, గుర్తు తెలియని వ్యక్తులు సంచరించిన సీసీ కెమెరాలతో గుర్తించవచ్చన్నారు. మండల వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు నాయకులు, వ్యాపారవేత్తలు, దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు విరాళం అందించిన మహేశ్యాదవ్ను పోలీసులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.