వికారాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేడు వికారాబాద్ జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు తాండూరుకు చేరుకోనున్న సీఎం కేసీఆర్ మొదటగా తాండూరు పట్టణంలోని విలేమూన్ గ్రౌండ్లో జరిగే సభకు హాజరవుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు కోస్గి పట్టణంలో జరిగే సభకు హాజరై అనంతరం మహబూబ్‌నగర్‌లో జరిగే సభకు వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు పరిగి పట్టణంలోని జింఖానా గ్రౌండ్లో నిర్వహించే సభకు హాజరుకానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాండూరులో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కోస్గిలో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, పరిగిలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి సభా ఏర్పాట్లను
పర్యవేక్షించారు.