రంగారెడ్డి, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఫలితం వెలువడేందుకు ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల బరిలో 43 మంది నిలువగా.. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది. ఈ ఎన్నికల్లో 16,57,107 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా.. విజేత ఎవరో నేడు తేలనున్నది. చేవెళ్ల మండలం గొల్లపల్లి గ్రామంలోని బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఓట్ల లెక్కింపు కోసం 165 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానున్నది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి.. 8.30 గంటల నుంచి ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. సాయంత్రం 3 గంటల లోపు తుది ఫలితం వెలువడే అవకాశం ఉంది. 777 మంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ విధులను నిర్వర్తిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు చర్యలను చేపడుతున్నది.
చేవెళ్ల లోక్‌సభ బరిలో 43 మంది అభ్యర్థులు ఉండడంతో ప్రతి పోలింగ్ కేంద్రంలో మూడు ఈవీఎంలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 56.40 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 29,38,370 మంది ఓటర్లకుగాను 16,57,107 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఓట్ల కౌంటింగ్ కోసం 164 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. అత్యధిక పోలింగ్ కేంద్రాలు ఉన్న మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు కోసం 28 చొప్పున టేబుల్స్‌ను ఏర్పాటు చేస్తుండగా.. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపునకు 25 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి టేబుల్ వద్ద ఓ సూపర్వైజర్, ఇద్దరు సహాయకులు, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు.
ఈ లెక్కన చేవెళ్ల లోక్‌సభ ఓట్ల లెక్కింపు కోసం 777 మంది ఎన్నికల సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఇందులో కౌంటింగ్ సూపర్వైజర్లు 227 మంది, కౌంటింగ్ అసిస్టెంట్స్ 273 మంది, మైక్రో అబ్జర్వర్లు 277 మంది ఉన్నారు. ఓట్ల లెక్కింపులో ఒక్కో రౌండ్‌కు 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. అంటే గంటకు నాలుగు రౌండ్లు పూర్తవుతాయి. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాకే రౌండ్ల వారీగా ఓట్లను క్రోడీకరించి ఫలితం ప్రకటిస్తారు. ఏఆర్వోతోపాటు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేకంగా వచ్చిన పరిశీలకుల పర్యవేక్షణలో సీసీ కెమెరాల నిఘాలో కౌంటింగ్ కొనసాగుతుంది.
చేవెళ్ల లోక్‌సభ ఎన్నికలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు పోటీపడ్డారు. ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది. ఎవరికి వారుగా విజయవకాశాలపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేవెళ్ల నుంచే లోక్‌సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించడం.. కేటీఆర్ రోడ్డుషోలు వంటి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ పుంజుకున్నదని నేతలు పేర్కొంటున్నారు.
గత పదేండ్లలో బీఆర్ఎస్ పాలనతో కాంగ్రెస్ ఐదు నెలల పాలనను పోల్చుకుని ప్రజలు ‘కారు’ వైపే మొగ్గు చూపారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే రెండు సార్లు వరుసగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్‌పై గంపెడాశలు పెట్టుకున్నది. ఏదేమైనా.. నిశ్శబ్ద విప్లవంలో ఓటర్లు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో ఏ పార్టీవైపు మొగ్గు చూపారన్న విషయంలో సర్వత్రా ఉత్కంఠత నెలకొన్నది. ఈ ఉత్కంఠ వీడాలంటే మంగళవారం సాయంత్రం వరకు వేచి చూడక తప్పదు.
