రంగారెడ్డి, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): రాజేంద్రనగర్‌కు మరో మణిహారం ‘మెట్రో రైలు’ అని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి అన్నారు. మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ – నాలుగో కారిడార్‌కు డిసెంబర్ 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభకు ప్రజలు పెద్దఎత్తున తరలి రావాలని ఎంపీ రంజిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మెట్రో రైల్ శంకుస్థాపన అనంతరం అప్పా జంక్షన్లో పోలీస్ అకాడమీ ఆవరణలో జరిగే బహిరంగ సభ స్థలాన్ని ఎంపీ డా. రంజిత్‌రెడ్డి గురువారం పరిశీలించారు.
అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాదాపూర్ మైండ్ స్పేస్ నుంచి రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మెట్రో రైలు కారిడార్ నిర్మాణం జరుగనుంది. మెట్రో రైల్ కార్యక్రమానికి విచ్చేయనున్న సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు, అలాగే బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని ఎంపీ పిలుపునిచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, అందరూ వచ్చి ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేయాలని ఆయన కోరారు.
కార్యక్రమానికి వచ్చే ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరు మైండ్ స్పేస్ వద్దకు రావొద్దని, నేరుగా బహిరంగ సభాస్థలి వద్దకు ఉదయం 9 గంటల వరకే చేరుకోవాలని కోరారు. సభకు విచ్చేసిన వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎంపీ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్ల విషయమై సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, బండ్లగూడ కార్పొరేషన్ మేయర్ మహేందర్‌గౌడ్, గండిపేట మండలం మాజీ ఎంపీపీ మల్లేశ్ ముదిరాజ్, స్థానిక కౌన్సిలర్లు ఉన్నారు.