చేవెళ్ల నియోజకవర్గం బీఆర్ఎస్ కంచుకోట.. మరోసారి విజయఢంకా మోగిస్తాం.. అని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు మరోసారి చేవెళ్ల బీఆర్ఎస్ సీటు కేటాయించడంపై ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా.. నియోజకవర్గ అభివృద్ధిని వివరించారు. ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా సేవలందిస్తున్న తనకు బీఆర్ఎస్ అధినేత మళ్లీ అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 2014 కంటే ముందు చేవెళ్ల ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడి ఉండేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో నియోజకవర్గాన్ని ఊహించని రీతిలో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
-షాబాద్, ఆగస్టు 24
రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మె ల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలుగా ప్రజలకు సేవలందిస్తున్న ఆయనకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మూడోసారి కూడా అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. తాను ఎమ్మె ల్యేగా గెలుపొందిన తర్వాతే నియోజకవర్గ రూపురేఖలు ఎంతో మారాయ న్నాయని.. చేవెళ్ల గడ్డ.. బీఆర్ఎస్ అండగా మారిందన్నారు. 2014 కంటే ముందు చేవెళ్ల ప్రాంతం పూర్తిగా అభివృద్ధికి దూరంగా ఉండేదన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో నియోజకవర్గాన్ని ఊహించని రితీలో అభివృద్ధి చేశానన్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూ..
నమస్తే: ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, జనంలో ఉన్న స్పందన..?
ఎమ్మెల్యే : ఈ తొమ్మిదేండ్ల కాలంలో నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగింది. మంత్రి కేటీఆర్ సహకారంతో షాబాద్ మండలంలోని చందనవెల్లి, సీతారాంపూర్ గ్రామాల్లో పెద్ద ఎత్తున కంపెనీలు వెలిశాయి. శంకర్పల్లి మండలంలోని కొండకల్లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కావడంతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. నగరానికి దగ్గర్లో ఉన్న ఈ నియోజకవర్గానికి పెద్ద, పెద్ద కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెడుతుండటంతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రధానంగా ఈసీ, మూసీ వాగులపై పది బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఇప్పటి కే నిధులు మంజూరయ్యాయి. ఇందులో కొన్నింటి పనులు చివరి దశకు చేరుకున్నాయి. మారుమూల గ్రామాలకు బీటీ రోడ్లు వేయించాం. మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధి, అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నాం. పల్లెప్రగతి ద్వారా గ్రామాలు పచ్చదనంతో పరిఢవిల్లుతున్నాయి. పారిశుద్ధ్యం మెరుగైనది. 84 గ్రామాల ప్రజలకు గుదిబండగా ఉన్న జీవో 111ను ప్రభుత్వం ఎత్తివేయడంతో ఆ గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగనున్నది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను మరమ్మతులు చేయడంతో వర్షాలకు చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. బోరు బావుల్లో నీటిమట్టం పెరుగడంతో వ్యవసాయం సస్యశ్యామలమైనది.
నమస్తే : ఎమ్మెల్యే టికెట్ రావడంపై మీ అభిప్రాయం?
ఎమ్మెల్యే : చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి అధికార పార్టీలో చేరా. 2018లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి 33,552 మెజార్టీలో గెలుపొందా. ఈ తొమ్మిదేండ్లలో ఊహించని విధంగా అభివృద్ధి చేశా. కోట్లాది రూపాయలను ప్రభుత్వం నుంచి తీసుకొచ్చా. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మూడోసారి కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొంది చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగురవేస్తాం. పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు.
నమస్తే : తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసం…?
ఎమ్మెల్యే : ప్రజలకు తెలంగాణ ప్రభుత్వంపై చాలా విశ్వాసం ఉన్నది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీబంధు, పంట రుణాల మాఫీ, గృహలక్ష్మి తదితర పథకాలతో పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. తెలంగాణలోని ప్రతి ఇల్లూ ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నది. గతంలో ఉన్న ఏ ప్రభుత్వాలూ పేదలు పట్టించుకోలేదు. పేదల పక్షపాతిగా సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. శుభోదయం కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నా. రానున్న ఎన్నికల్లోనూ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలవడం ఖాయం. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి.. మూడోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.