చేవెళ్ల టౌన్ : బసవేశ్వరుడి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలో వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుడి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై పూలమాల వేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ బసవేశ్వరుడు సమాజానికి ఎంతో సేవ చేసిన మహాత్ముడిగా నిలిచారని వారు కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
బసవేశ్వరుడు 12వ శతాబ్దంలోనే గొప్ప సంఘ సంస్కర్త అని, కుల, మత ప్రాంతీయ భేదాలు లేకుండా మానవులంతా ఒక్కటేనని తేల్చిచెప్పిన మహానీయుడు బసవేశ్వరుడని గుర్తు చేశారు. ఒక వైపు రాజ్యపాలనలో ప్రధాన భూమిక పోషిస్తూ బసవన్న వచన సాహిత్యంతో ప్రజలందరిని ఏకం చేసిన వ్యక్తి బసవేశ్వరుడని తెలిపారు. ఆహారం, ఇల్లు, బట్ట, జ్ఞానం, వైద్యం మానవుని కనీస హక్కులని, దేహమే దేవాలయమని నమ్మిన వ్యక్తి బసవేశ్వరుడని తెలిపారు. విప్లవాత్మకమైన మార్పులు రావడానికి పరోక్షంగా బసవేశ్వరుడే కారణమంటారని గుర్తు చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శివనీల, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అబ్దుల్ ఘని, బసవేశ్వర సంఘం అధ్యక్షుడు కర్నె వీరేశ్, మాజీ ఎంపీపీ బాల్రాజ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి హన్మంత్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు శేరి శివారెడ్డి, ప్రసాద్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.