Kodangal | కొడంగల్, మే 06 : రాజీతో కేసులు పరిష్కరించుకునే అవకాశం లోక్ అదాలత్ కల్పించిందని, సద్వినియోగం చేసుకొని కేసులను పరిష్కరించుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి శ్రీరామ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హైకోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు జూన్ 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేకంగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రూ. 5 లక్షల లోపు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయిన వాటికి సంబంధించి కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. ఈ కేసుల పరిష్కారంలో భాగంగా ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా రాజీ కుదుర్చుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇరు వర్గాల అంగీకారం ప్రకారం కేసులు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకులకు సంబంధించిన చెక్ బౌన్స్ కోసుల్లో కూడా రాజీ కుదుర్చుకోవచ్చని తెలిపారు. రాజీ మార్గంలో ఇరువర్గాల వారికి మేలు జరుగుతుందన్నారు. జూన్ 14వ తేదీన జాతీయ లోక్ అదాలత్లో అధిక మొత్తంలో కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు.