వికారాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రజల మాన, ప్రాణాలను రక్షించాల్సిన పోలీసులు అమాయకులను కేసుల్లో ఇరికించడం, భూ సెటిల్మెంట్లు, ఇసుక దందాలతో తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఆ డిపార్ట్మెం ట్లో నిజాయితీ, నిబద్ధత కలిగిన అధికారులున్నా కొందరు పోలీసుల తీరు తో ప్రజల్లో చులకన అవుతున్నారు. జిల్లా పోలీస్ అధికారికి నిజాయితీగల అధికారిగా పేరున్నా కిందిస్థాయి అధికారులు, సిబ్బంది చేస్తున్న వ్యవహారాలతో ఆ యంత్రాంగానికే మచ్చ వస్తున్నది.
ఇటీవల జరిగిన రెండు, మూడు ఘటనలతో జిల్లా పోలీసులు విమర్శల పాలయ్యారు. వారం రోజుల కిందట డాక్టర్ కారులో గంజాయి దొరికిన ఘటనలో పోలీసులపై జిల్లా అంతటా వ్యతిరేక ప్రచారం జరిగింది. తనిఖీల్లో భాగంగా వికారాబాద్ పట్టణానికి చెందిన ప్రదీప్ అనే డాక్టర్ కారులో గంజాయి దొరికిందని, కేసు నమోదు చేశామని సాక్షాత్తూ వికారాబాద్ టౌన్ సీఐ భీమ్‌కుమార్ మీడియాతో చెప్పి నా.. వారం రోజులైనా ఆ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతోపాటు అస్సలు కేసు ఊసే సంబంధిత పోలీసులు ఎత్తకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
పోలీసులు కుట్రతోనే కారులో గంజాయి పెట్టి కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని డాక్టర్లంతా మీడియాకు వివరించడం, ఎస్పీకి ఫిర్యాదు చేయడంతోపాటు డీజీపీకి, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామనడంతో ఖంగుతున్న పోలీసులు ఆ పంచాయితీని స్పీకర్ వద్దకు తీసుకెళ్లి ఫుల్స్టాప్ పెట్టించినట్లు జిల్లా అంతటా జోరుగా ప్రచారం జరుగుతున్నది. డ్రంక్ అండ్ డ్రైవ్‌తోపాటు వాహనాల తనిఖీల సమయంలో వీడియో తీసే పోలీసులు ఎందుకు వీడి యో తీయలేదని..
ఒకవేళ గంజాయి దొరికితే ఎక్కడ కొన్నారనేది ఇప్పటివరకు తేల్చకపోవడం..నిజంగానే డాక్టర్ కారులో గంజాయి దొరికితే కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్ల కంటే ముందే స్పీకర్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతుండడంపై రక్షక భటులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఓ అధికారి మెప్పు కోసమే వికారాబాద్ టౌన్ సీఐ డాక్టర్ కారులో గంజాయి నాటకానికి తెరతీశారనే ప్రచారమూ జరుగుతుండడం గమనార్హం.
కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను రాబట్టేందుకు స్పెషల్ బ్రాంచ్ అధికారులకు విచారణ బాధ్యతను జిల్లా ఎస్పీ అప్పగించగా.. కారులో గంజాయి స్వాధీనం ఉత్తుత్తిదేనని ఎస్బీ పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా బాస్‌ను తప్పుదోవ పట్టిస్తూ పోలీసుల పరువు తీస్తున్న పలువురు పోలీసులపై నిఘా పెట్టి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.
ఇసుక దందాలోనూ..!
జిల్లాలో ఇసుక యాలాల, తాండూరు మండలాల్లో అధికంగా లభ్యమవుతుంది. ఒక్క యాలాల మండలంలోనే లక్షల క్యూబిక్ మీటర్లను కాగ్నానది నుంచి అక్రమంగా తరలిస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ప్రతిరోజూ కాగ్నానది నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ ఇసుక దందాలోనూ పోలీసుల ప్రమేయం ఉందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. ఏకంగా పోలీసులే ఇసుక అక్రమ రవాణాను దగ్గరుండి చూసుకుంటున్నారనే విమర్శలున్నాయి.
ఒక్కో ట్రాక్టర్‌కు ఇంత మొత్తం చెల్లించాలని మాట్లాడుకుని మరీ వసూలు చేస్తు న్నారని పలువురు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇసుక మాఫియా నుంచి వసూలు చేసే డబ్బును స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు పోలీసు అధికారులకు అందిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక దందాను అరికట్టాల్సిన అధికారులే వెనుకుండి నడిపిస్తుండడంతో ప్రతిరోజూ జిల్లాలో ఏదో ఒకచోట ఇసుకను అక్రమంగా తరలిస్తూ ట్రాక్టర్లు, టిప్పర్లు పట్టుబడుతున్నా.. దారి రవాణాకు మాత్రం అడ్డుకట్ట పడడంలేదని పలువురు మండిపడుతున్నారు.
భూ సెటిల్మెంట్లతో తీవ్ర ఆరోపణలు..
జిల్లాలోని కొన్ని ఠాణాలు సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయాయి. సివిల్(భూ తగాదాలు) వ్యవహారాల్లో తలదూర్చొద్దంటూ పోలీస్ ఉన్నతాధికారులు ప్రతి సమావేశంలోనూ ఆదేశాలిస్తున్నా కొందరు పోలీసులు మాత్రం పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. జిల్లాలోని పలు ఠాణాల్లో నిత్యం భూతగాదాలకు సంబంధించిన కేసులను పోలీసులు పరిష్కరిస్తూ.. వసూళ్లకు అడ్డాగా మార్చుతున్నారనే ప్రచా రం జోరుగా సాగుతున్నది. ఠాణాల్లో జరుగుతున్న భూసెటిల్మెంట్లలో అమాయకులకు అన్యాయం జరుగుతుందనే ఆరోపణలున్నాయి.
జిల్లాలోని చన్గోముల్, పరిగి, వికారాబాద్, నవాబుపేట ఠాణాల్లో పనిచేసే సిబ్బంది భూసెటిల్మెంట్లే ప్రధానంగా విధులు నిర్వర్తిస్తున్నారనే ప్రచారమూ జరుగుతున్నది. భూ తగాదాల్లో తలదూరుస్తూ, ఠాణాలోనే సెటిల్మెంట్లు చేస్తున్న చన్గోముల్ ఎస్ఐ మధుసూదన్‌రెడ్డిపై బుధవారం ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. అతడిపై స్థానిక కాంగ్రెస్ నేతలే ఐజీకి, డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డే ఎస్ఐని బదిలీ చేయించినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు.