కడ్తాల్, ఏప్రిల్ 17 : అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. గురువారం తలకొండపల్లి మండల పరిధిలోని గట్టుఇప్పలపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ వెంకటయ్య, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారాన్ని చేజిక్కించేందుకు అలవి కానీ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలు చేయడానికి అపసోపాలు పడుతుందని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత రేవంత్ సర్కార్కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
పూర్తి స్థాయిలో రైతు భరోసా, రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా పేదల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలేదని విమర్శించారు. పింఛన్ 4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, మహిళలకు రూ.2,500లు, యువతులకు స్కూటీ ఎక్కడా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను, మోసపూరిత హామీలను ప్రతి కార్యకర్త ఎండగట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరుపున పోరాటం చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రాజు, ఉపాధ్యక్షుడు జంగయ్య, నాయకులు కృష్ణయ్య, రవీందర్, అశోక్‌గౌడ్, కొండల్, వెంకటేశ్, మల్లేశ్, నర్సింహా, వెంకటయ్య, లింగంయాదవ్, రాఘవేందర్, జాను, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.