రంగారెడ్డి, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం చమురు ఉత్పత్తులపై పడటమే ఇం దుకు కారణం. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక హోటళ్ల నిర్వాహకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. హోటళ్లు, టిఫిన్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు గ్యాస్ సిలిండర్లు దొరకక మూతపడే పరిస్థితి నెలకొన్నది. జిల్లాలో హోటళ్లు, టీ స్టాళ్లు, ఫాస్ట్ఫుడ్, టిఫిన్ సెంటర్లు వేలల్లో ఉన్నాయి. ఇవన్ని కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై ఆధారపడి నడుస్తున్నాయి. హయత్నగర్, సరూర్నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, మహేశ్వరం, శం షాబాద్, రాజేంద్రనగర్, శంకర్పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, కడ్తాల్, ఆమనగల్లు, షాద్నగర్, యాచారం, మంచాల వంటి మండలాల్లో కమర్షియల్ సిలిండర్లపై ఆధారపడి ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవటంతో ఇప్పటికే కొన్ని టీ స్టాళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు మూతపడ్డాయి. మిగతావి కూ డా త్వరలోనే మూతపడే అవకాశాలున్నా యి. ఇప్పటికే నిర్వాహకులు అధి క మొత్తంలో డబ్బులు చెల్లించి బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు కొం టున్నారు. కమర్షియల్ సిలిండర్ ధర ఇప్పటివరకు 1,952 ఉండగా.. ప్రభు త్వం 114 పెంచింది. దీంతో సిలిండర్ ధర 2,066లకు చేరింది. అయినా దొరకడంలే దు. దిక్కుతోచని స్థితిలో నిర్వాహకులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొంటున్నారు.
జిల్లాలో ప్రస్తుతం హోటళ్లు, టీస్టాళ్లు, టిఫిన్, ఫాస్ట్ఫుడ్, బిర్యానీ సెంటర్లలో 35 వేల కమర్షియల్ సిలిండర్లను వాడుతున్నారు. వీటితోపాటు మరికొందరు అధికారికంగా కనెక్షన్లు లేకపోయినా బ్లాక్ మార్కెట్లో కొంటు న్నారు. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిపివేయడంతో వీరంతా ఉపాధికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది.
కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్నారు. హోటళ్లలో సాంబారు, ఇతర వంటకాలను తయారు చేసేందుకు కట్టెల పొయ్యిలను వాడుతున్నారు. హైదరాబాద్-నాగార్జునసాగర్ రహదారితోపాటు శ్రీశైలం-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు వంటి రహదారులకిరువైపులా ఉన్న హోటళ్లు ఇప్పటికే భోజనాలు, కూరల తయారీకి కట్టెల పొయ్యిలనే ఉపయోగిస్తున్నారు. కాని.. టీ, ఫాస్ట్ఫుడ్ వంటి వాటిని తయారుచేసే చిరువ్యాపారులు మాత్రం తాత్కాలికంగా తమ దుకాణాలను మూసివేస్తున్నారు. కమర్షియల్ సిలిండర్లు దొరకకపోవడంతో హోటళ్ల నిర్వాహకులు డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్నారు. దీంతో గృహావసరాలకు వినియోగించే సిలిండర్లకు డిమాండ్ బాగా పెరిగింది. హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ నిర్వాహకులు డొమెస్టిక్ సిలిండర్ల ను బ్లాక్ మార్కెట్లలో కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. ఒక్కో సిలిండర్ ధర 965 ఉండగా.. ప్రస్తుతం రూ.1300 నుంచి రూ. 1500ల వరకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారు.
ఇబ్రహీంపట్నం : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఇబ్ర హీంపట్నం నియోజకవర్గంలో బాగా ప్రభావాన్ని చూపుతున్నది. వంటగ్యాస్.. పెట్రోల్, డీజిల్ కొరత ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నది. ప్రతిరోజూ వంటగ్యాస్ కోసం ప్రజలు ఉదయం నుం చి సాయంత్రం వరకు ఏజెన్సీల ఎదుట నిరీక్షించాల్సిన పరిస్థితి నెల కొన్నది. ఇబ్రహీంపట్నంలోని భారత్ గ్యాస్ గోదాము వద్ద శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరారు. అలాగే, లోయపల్లి ఇండియన్ గ్యాస్, దండుమైలారం హెచ్పీ గ్యాస్ గోదాముల వద్ద కూడా సిలిండర్ల కోసం ఎండలో పడిగాపులు కాస్తున్నారు. అలాగే, పెట్రోల్, డీజిల్ కొరత కూడా ఏర్పడటంతో బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కోసం ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.