వికారాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. జిల్లాలో రైల్వేబ్రిడ్జిలను నిర్మించాలని పలుసార్లు ప్రజాప్రతినిధులు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు. జిల్లాకు 15 రైల్వే బ్రిడ్జిలను మంజూరు చేయాలని గత కొన్నేండ్లుగా కేంద్రానికి విన్నవిస్తున్నా ఇప్పటివరకు ఒక్క బ్రిడ్జికి కూడా నిధులు మంజూరు కాలేదు.
వికారాబాద్ పట్టణంలో తాండూరు వెళ్లే మార్గంలో, రామయ్యగూడ, గంగారం వద్ద.. తాండూరు పట్టణంలోని పాత తాండూరుతోపాటు మరో రెండు చోట్ల రైల్వే బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని ప్రజాప్రతినిధులు విన్నవించారు. అలాగే, ధారూరు వద్ద, తరిగోపుల వద్ద, మర్పల్లి, మొరంగపల్లి వద్ద, గేటువనంపల్లి వద్ద, బషీరాబాద్ మండల కేంద్రంతోపాటు పలు చోట్ల నిర్మించాలని కేంద్రాన్ని కోరారు. రైల్వే బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలన్న ప్రతిసారీ సర్వేలు చేసి వదిలేస్తున్నారు.
ఏండ్లు గడిచినా రైల్వే బ్రిడ్జిల నిర్మాణం సర్వేల వద్దనే ఆగిపోతున్నది. రైల్వే బ్రిడ్జిల నిర్మాణంలో మోదీ ప్రభుత్వం సర్వేలతోనే కాలయాపన చేస్తుండడంతో జిల్లాలోని ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నారు. అంతేకాకుండా బ్రిడ్జిలు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు కోల్పోవాల్సి వస్తున్నది.
గతంలో వికారాబాద్ సమీపంలోని కొత్తగడి రైల్వేట్రాక్ వద్ద గేట్ లేకపోవడంతో వికారాబాద్ మండలంలోని మదన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు వెళ్తున్న కారును రైలు ఢీకొనడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తదనంతరం స్పందించిన సంబంధిత శాఖ అధికారులు రైల్వే గేట్‌ను ఏర్పాటు చేశారు.
ఏదో ఒక ప్రమాదం జరిగితే గానీ కేంద్ర ప్రభుత్వం స్పందించదా..? అని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు చేవె ళ్ల పార్లమెంట్ నుంచి ఎంపీగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలిచినా.. రైల్వే బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్రం నుంచి నయా పైసా తీసుకురాకపోవడం గమనార్హం.
కేంద్రానికి పట్టని ప్రజల కష్టాలు..
ప్రతిఏటా రైల్వే బడ్జెట్లో జిల్లాకు సంబంధించి ఎదురుచూపులే మిగులుతున్నాయి తప్పా నిధులు రావడంలేదు. ఎంఎంటీఎస్‌ను వికారాబాద్ వరకు పొడిగించడంతోపాటు బుల్లెట్ రైలు తదితర ప్రాజెక్టులను పెండింగ్‌లోనే పెడుతున్న మోదీ ప్రభుత్వం కనీసం రైల్వే బ్రిడ్జిలను కూడా నిర్మించేందుకు నిధులివ్వడం లేదు. బ్రిడ్జిలు మంజూరు చేయాలని జిల్లా ప్రజాప్రతినిధులు పలుసార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదు. రైల్వే బ్రిడ్జిలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో అరగంట వరకు ఎదురుచూడక తప్ప ని పరిస్థితి నెలకొంది.
తాండూరు నుంచి వికారాబాద్ మీదుగా హైదరాబాద్ వెళ్లే అంబులెన్స్‌లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ బ్రిడ్జిలు లేకపోవడంతో రైల్వేగేట్ల వద్ద ఎదురుచూడక తప్పడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధారూరు మండలంలోని తరిగోపుల సమీపం లో ఉన్న రైల్వేలైన్‌తో ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కష్టా లు పడుతున్నారు. గేట్ లేకపోవడంతో కిలోమీటర్ మేర తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. బషీరాబాద్ మండల కేంద్రంలోనూ రైల్వే బ్రిడ్జి లేకపోవడంతో కిలోమీటరు మేర తిరిగి బషీరాబాద్ ప్రభుత్వ కార్యాలయాలతోపాటు జీవంగి తదితర గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.