ఆమనగల్లు, మే 14 : హిందూ మతాన్ని మేమే నడిపిస్తున్నాం.. హిందూ మతాన్ని మా కన్నా ఎవరూ రక్షించలేరని చెప్పే ఈ బీజేపీ దుర్మార్గులకు.. లైంగిక దాడికి గురైన ఆ బిడ్డ హిందూ బిడ్డ కాదా అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదై వారం రోజులు గడుస్తున్నా, నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండి పడ్డారు. ఆమనగల్లులో గురువారం సాయంత్రం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్‌గుప్తా ఆధ్వర్యంలో బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున మహిళలు, బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. దీనికి ప్రవీణ్‌కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు.
రాజీవ్‌గాంధీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ గత 6 రోజుల క్రితం పేట్‌బషీర్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌లో మైనర్ బాలికైన తన కుమార్తెను గత సంవత్సర కాలం నుంచి భగీరథ్ అనే దుర్మార్గుడు లైంగికదాడి చేసిండని పోలీస్‌స్టేషన్‌లో ఆమె తల్లి కేసు పెడితే ఈ పోలీస్వాళ్లు ఆ కేసును రిజిస్టర్ చేయకుండా కాలయాపన చేశారని మండిపడ్డారు. లైంగికదాడి గావింపబడిన మైనర్ బాలికపై నీవు దొంగవు, నా కొడుకును చంపడానికి ప్రయత్నం చేసినావని బండి సంజయ్ కరీంనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేసిండని విరుచుకుపడ్డారు.
సీఎం, హోం మంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కనుసన్నల్లో పోలీస్ వ్యవస్థ నడుస్తున్నదని ఆగ్రహించారు. డబ్బున్నవాళ్లు కేసు పెడితే నిమిషంలో కేసు బుక్ చేసే పోలీసులు, డబ్బులేని పేద కుటుంబమైన బాధితురాలి తల్లి కేసు పెట్టడానికి పోలీసుల కాళ్లావేళ్లా పడి కన్నీరుమున్నీరుగా విలపించినా.. రాత్రి 12 గంటల వరకు కేసు బుక్ చేయకుండా పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టిన దుస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందని.. ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఈ విషయంపై ఆలోచన చేయాలని కోరారు. అమ్మాయిలపై లైంగికదాడి చేస్తే పోలీసులు వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని, ఈ కేసులో బెయిల్ ఇవ్వకూడదని చట్టంలో రాసి ఉన్నప్పటికీ పోలీసులు భగీరథ్ అనే దుర్మార్గుడిని విడిచిపెట్టి ఇప్పటికీ పట్టుకోలేదని ఆయన పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లక్ష మంది పోలీసులు ఉన్న తెలంగాణలో పరారీలో ఉన్న భగీరథ్ ఎందుకు దొరకడంలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్‌లో ఉన్న రేవంత్‌రెడ్డి, బీజేపీలో ఉన్న బండి సంజయ్ ఇద్దరు మిత్రులని.. వాళ్లు ఇద్దరు కలిసి తెలంగాణలో అమ్మాయిల జీవితాలను నాశనం చేయాలని అనుకుంటున్నారేమో అని వీళ్లని ప్రజలు నిలదీయాలన్నారు. మన గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే చెట్టుకు కట్టేసి ఊరంతా జనాలు చెప్పులతో కొడతారని, కానీ రేవంత్ ప్రభుత్వం చిన్న కేసు పెట్టి.. బిడ్డా నీవు భయపడకు నీకు ఏం కాదు, నీవు బయటకు రాకు.. ఇక్కడ ముఖ్యమంత్రిగా నేనున్నా, కేంద్ర సహాయ మంత్రిగా మేమున్నాం.. నీకు లక్షల మంది రక్షణగా ఉన్నారు.. నీవు అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తూ ఉండురా అన్నట్లు వ్యవహరిస్తున్నారన్నారు.
బాధితురాలి తల్లి ఉదయం నాతో చరవాణిలో మాట్లాడుతూ.. నా బిడ్డ రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసిందని, నిందితుడు మాత్రం నా బిడ్డతో దిగిన ఫొటోలు ప్రపంచమంతా తెలిసేలా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నడని బోరున విలపించిందని పేర్కొన్నారు. బండి సంజయ్ తమకు పుట్టగతులుండవని బెదిరిస్తుండని.. ఈ బెదిరింపులకు భయపడుతూ ఇంట్లో చస్తానన్న బిడ్డను చంపుకోలేక, బాధతో విలసిస్తున్న బిడ్డను చూసి తాళలేక, ధైర్యం తెచ్చుకుని నేను చచ్చినా పర్వాలేదు.. తన బిడ్డకు న్యాయం చేయాలని పేట్‌బషీర్‌బాగ్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిందని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే భగీరథ్‌ను అరెస్టు చేయాలని, కేంద్ర హోం సహాయ మంత్రి పదవి నుంచి బండి సంజయ్‌ను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మైనర్ బాలికకు అండగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆమనగల్లులో జరిగిన ఈ కార్యక్రమం మాదిరిగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు ఎంపీడీవో ప్రాంగణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బండి సంజయ్ డౌన్ డౌన్, ఆడపిల్లలను కాపాడలేని ప్రభుత్వం గద్దె దిగాలని పలు రకాల నినాదాలు చేశారు. కార్యక్రమంలో కడ్తాల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, మున్సిపాలిటీ కౌన్సిలర్లు రాము, ఆంజనేయులుయాదవ్, రమేశ్, భాగ్యలక్ష్మి, నాగిళ్ల జగన్, పుల్లారెడ్డి, అనూష, సీనియర్ నాయకులు ఖలీల్, వస్పుల సాయిలు, సైదుల్గౌడ్, శ్రీధర్ గోవింద్, గోపి, శేఖర్, విక్రం ఉన్నారు.