యాచారం, మార్చి 24 : విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడంతో బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు మంగళవారం తెల్లవారుజామునే అరెస్టు చేసి ఆయా పోలీస్స్టేషన్లకు తరలించారు. మండలంలోని బొల్లిగట్టతండాకు చెందిన బీఆర్ఎస్వీ మండల ప్రధాన కార్యదర్శి గణేష్నాయక్ను యాచారం పోలీసులు అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మేడిపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు అండేకార్ అనిల్, బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు జాల నాగరాజు, బీఆర్ఎస్ గ్రామశాఖ యువజన విభాగం అధ్యక్షుడు ఉడుతల ప్రవీణ్‌తో పాటు నాయకులు, కార్యకర్తలను హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీసులు అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు.
హామీలు అమలు చేసేవరకు ఉద్యమం ఆగదు
ఇబ్రహీంపట్నం : ఎవరైనా స్వేచ్ఛగా తమ నిరసనలు తెలుపవచ్చు అన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలు మాటలకే పరిమితమయ్యాయని పలువురు బీఆర్ఎస్వీ నాయకులు పేర్కొన్నారు. సర్కారు ఇకనైనా మేల్కొని విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేసి, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు, ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్వీ ఉద్యమం ఆగదని.. విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటామన్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్‌కుమార్, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్వీ సీనియర్ నాయకుడు ఏనుగు భరత్‌రెడ్డి, మహ్మద్ జానీపాషా, ఆంగోతు ప్రవీణ్‌నాయక్, బీఆర్ఎస్వీ నాయకులు జగదీశ్వర్, ముత్యాల వినోద్, కొండ్రు మహేశ్, యాచా రం సురేశ్‌తోపాటు పలువురిని ముందస్తు అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు.

Rr1
ప్రజలను మోసం చేసిన సర్కారు
కొందుర్గు : ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందని, అమలుకాని హామీలతో మోసం చేసిందని జిల్లేడ్‌చౌదరిగూడ మండల ప్రధాన కార్యదర్శి సత్యం అన్నారు. ముట్టడికి వెళుతున్న నాయకులను అరెస్ట్ చేసి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
కాలయాపన చేస్తున్న ప్రభుత్వం
షాద్‌నగర్‌టౌన్ : విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్వీ తాలుకా అధ్యక్షుడు శీలం శ్రీకాంత్ విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదన్నారు. విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొన్నదన్నారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా మభ్యపెడుతున్నదని, ప్రభుత్వం మాటల గారడీని మానుకొని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్టయిన బీఆర్ఎస్వీ నాయకులను సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.