హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): అవయవ మార్పిడులు, రోబోటిక్ సర్జరీలు, అరుదైన శస్త్రచికిత్సల నిర్వహణలో ఎప్పటికప్పుడు జాతీయ, అంతర్జాతీ య స్థాయి రికార్డులు సృష్టిస్తున్న నిమ్స్ దవాఖాన వైద్యులు తాజాగా మరో రికార్డు నెలకొల్పారు. సుదీర్ఘంగా నిర్వహించే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) శస్త్రచికిత్సను అత్యం త వేగంగా పూర్తిచేసి ఫంక్షనల్ న్యూరోసర్జరీ రంగంలో కొత్త చరిత్ర సృష్టించారు. ఇందులో కీలకపాత్ర పోషించిన న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ వై వంశీకృష్ణ బృందంతోపాటు డాక్టర్ శిరీష, డాక్టర్ వసుంధర తదితరులను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ అభినందించారు. సాధారణంగా పారిన్సన్స్, ఎసెన్షియల్ ట్రెమర్, డిస్టోనియా లాంటి మూవ్మెంట్ డిజార్డర్లతో బాధపడే రోగులకు 5-6 గంటలపాటు డీబీఎస్ శస్త్రచికిత్స నిర్వహిస్తారని, ఆ సమయంలో రోగులు మెలకువలో ఉండాల్సి రావడంతో శారీరక అసౌకర్యంతోపాటు మానసిక ఆందోళనకు, అలసటకు గురయ్యేవారని డాక్టర్ వంశీ కృష్ణ వివరించారు. ప్రస్తుతం తాము నిమ్స్‌లో ఎంపిక చేసిన ఐదుగురు రోగులకు జనరల్ అనస్థీషియా ఇవ్వడం ద్వారా కేవలం 2 గంటల్లోపే డీబీఎస్ శస్త్రచికిత్సను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించినట్టు వెల్లడించారు. ప్రయోగాత్మకమైన ఈ ఆధునిక చికిత్సా పద్ధతితో రోగులకు భారీ ఉపశమనం కలగడంతోపాటు వేగంగా కోలుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. గత రెండున్నరేండ్లలో నిమ్స్ 200కుపైగా డీబీఎస్ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి దేశంలోని ప్రముఖ ఫంక్షనల్ న్యూరోసర్జరీ వైద్యసంస్థల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు.
ట్రెమర్ రోగులకు అత్యాధునిక చికిత్స
వణుకు(ట్రెమర్) సమస్యతో బాధపడే రోగుల కోసం నిమ్స్‌లో అత్యాధునిక ఎంఆర్ఐ గైడెడ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చికిత్సను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు డాక్టర్ వంశీకృష్ణ వెల్లడించారు. ఆధునిక ఎంఆర్ఐ సీక్వెన్స్‌ల సాయంతో డెంటాటో-రూబ్రో-థలామిక్(డీఆర్టీ) మార్గాన్ని అత్యంత కచ్చితత్వంతో గుర్తించి ఈ చికిత్స అందిస్తున్నామని, శరీరంలో ఎలాంటి శాశ్వత పరికరాలను అమర్చాల్సిన అవసరం లేకుండా ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నామని చెప్పారు. కార్పొరేట్ దవాఖానల్లో రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను సీఎం స హాయ నిధి ద్వారా పేదలకు నిమ్స్‌లో ఉచితంగా అందజేస్తున్నామని, న్యూరోజెనిక్ బ్లాడర్ సమస్యతో బాధపడుతున్న రోగులకు నిమ్స్‌లో సాక్రల్ న్యూరోమాడ్యులేషన్ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు.