ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 25 : ఇబ్రహీంపట్నం బైపాస్ రోడ్డుకు మహర్దశ వచ్చింది. ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని బైపాస్ రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మరోవైపు నాగన్‌పల్లి సమీపంలోని ఎన్ఎస్జీ, ఆక్టోపస్‌లకు కూడా ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇప్పటికే సాగర్ రహదారి నుంచి బీడీఎల్ వరకు రూ.18 కోట్లతో అధికారులు నాలుగులేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీనికి అను సంధానంగా బీడీఎల్ ఎక్స్‌రోడ్డు నుంచి నాగన్‌పల్లి ఎక్స్‌రోడ్డు వరకు సుమారు రూ.6 కోట్లతో బైపాస్ రోడ్డును డబుల్‌గా మార్చే పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే బైపాస్‌రోడ్డు డబుల్‌రోడ్డుగా మార్చే పనులు చకచక సాగుతున్నాయి. ఇబ్రహీంపట్నం చెరువుకట్టపై గల సాగర్ రహదారి నుంచి ఇప్పటికే బీడీఎల్ వరకు రోడ్డు నిర్మాణాన్ని టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో పనులు దాదాపు పూర్తయ్యాయి. బీడీఎల్ రోడ్డు నుంచి ఉన్న బైపాస్ రోడ్డు సుమారు రెండున్నర కిలోమీటర్లు నాగన్‌పల్లి ఎక్స్‌రోడ్డు వరకు డబుల్ రోడ్డుగా మారిస్తే ఆక్టోపస్, ఎన్ఎస్జీతో పాటు క్లస్టర్ పార్కుకు కూడా అనుకూలంగా మారుతుంది. దీంతో అధికారులు ఈ రోడ్డు మరమ్మత్తు పనులు చకచక చేపడుతున్నారు.
ఆక్టోపస్, ఎన్ఎస్జీకి మరింత అనుకూలం..
ఇబ్రహీంపట్నం సమీపంలోని వినోభానగర్‌లో ఏర్పాటు చేసిన ఆక్టోపస్, ఎన్ఎస్జీ సంస్థలకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ రోడ్డు మరమ్మతుకు నోచుకోకపోవటం వల్ల ప్రస్తుతం ఎన్ఎస్జీ, ఆక్టోపస్ కమెండోస్, సిబ్బంది ఇబ్రహీంపట్నం మీదుగా హైదరాబాద్‌కు వెళ్లేవారు. నిత్యం రద్దీగా ఉండే ఇబ్రహీంపట్నం రోడ్లతో వారు అనుకున్న సమయానికి గమ్యానికి చేరుకోలేకపోయారు. దీంతో వారు అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. ప్రస్తుతం బైపాస్‌రోడ్డు వెడల్పు పనులు పూర్తయితే వీరు ఇబ్రహీంపట్నంతో సంబంధం లేకుండా నేరుగా బైపాస్‌రోడ్డు వెంట సాగర్హ్రదారి చేరుకుని అక్కడినుంచి హైదరాబాద్‌కు వెళ్లే అవకాశం ఉంది. నాగన్‌పల్లి ఎక్స్‌రోడ్డు నుంచి బైపాస్‌రోడ్డు పనులు పూర్తయితే నాగన్‌పల్లి, పోల్కంపల్లి గ్రామాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వారికి ఇబ్రహీంపట్నంతో సంబంధం లేకుండా నేరుగా వెళ్లడానికి కూడా అవకాశం లభిస్తుంది. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ వెళ్లే వాహనదారులు కూడా బైపాస్‌రోడ్డు నుంచి నేరుగా ఇబ్రహీంపట్నంతో సంబంధం లేకుండా ఖానాపూర్ గేటు వరకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. బైపాస్‌రోడ్డు నిర్మాణం పూర్తయితే ఎక్కువమంది ఇదే మార్గాన్ని ఎంచుకునే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు త్వరితగతిన బైపాస్‌రోడ్డును డబుల్‌రోడ్డుగా మార్చే పనులు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు బైపాస్‌రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం కావటంతో ప్రజలు, వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రవాణా కష్టాలు దూరం
ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేసిన రక్షణరంగ సంస్థలైన ఎన్ఎస్జీ ,ఆక్టోపస్‌లకు సరైన రోడ్డుమార్గం లేక నిత్యం రద్దీగా ఉండే ఇబ్రహీంపట్నం మధ్యలో నుంచి వెలుతూ తీవ్ర ఇబ్బందలుకు గురయ్యేవారు. ఈ రోడ్డు నిర్మాణంతో రక్షణరంగ సంస్థలతో పాటు పోల్కంపల్లి, నాగన్‌పల్లి గ్రామాల ప్రజల రవాణా కష్టాలు పూర్తిగా తొలిగిపోనున్నాయి.
– మంచిరెడ్డి, కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం..