తుర్కయంజాల్ : వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణం బలైంది. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆస్పత్రిలో చేరిన భవన నిర్మాణ రంగ కార్మికుడు ఆకస్మాత్తుగా పరిస్థితి విషమించి కన్నుమూశాడు. హైదరాబాద్ శివారు తుర్కయంజాల్ శ్రీరాంనగర్ కాలేనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. తుర్కయంజాల్ శ్రీరాంనగర్ కాలేనీలో నివాసం ఉండే సత్యం గౌడ్ శనివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యతో రాగన్నగూడ లోని యంజాల్ ఆస్పత్రిలో చేరాడు. ఆదివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కార్డియక్ అరెస్టుతో సత్యం మరణించారని అతని కుటుంబసభ్యులకు తెలిపారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే సత్యం గౌడ్ మరణించాడని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వారికి మద్దతుగా సీపీఐ జిల్లా నాయకులు యాదయ్య, సీపీఎం తుర్కయంజాల్ కార్యదర్శి కిషన్ పలువురు నాయకులు ఆందోళనలో పాల్గొన్నారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం అందజేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.