శుక్రవారం 27 నవంబర్ 2020
Rangareddy - Aug 18, 2020 , 23:04:51

కిరాతకం..

కిరాతకం..

ప్రేమించిన యువతి కాదనడంతో మనస్తాపం

అక్క కూతురును ఇచ్చి బలవంతంగా వివాహం

పెండ్లి ఇష్టంలేక.. భార్యకు వేధింపులు    

అర్ధరాత్రి గొంతు నులిమి హత్య

ఆపై ఫినాయిల్‌ తాగి, బ్లేడ్‌తో కోసుకొని ఆత్మహత్యాయత్నం

శేరిలింగంపల్లి : పెద్దలు కుదిర్చిన పెండ్లి ఇష్టం లేక.. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ కిరాతకుడు. ప్రేమించిన అమ్మాయి కాదనడంతో... అతడికి అక్క కూతురుని ఇచ్చి బలవంతపు వివాహం చేశారు.. ఇష్టంలేని వివాహం చేశారని ఆమెపై ప్రతీకారంతో గొంతునులిమి దారుణంగా చంపేశాడు... ఆపై ఫినాయిల్‌ తాగి, బ్లేడుతో కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై రవికిరణ్‌ వివరాల ప్రకారం... 

అనంతపురం జిల్లా, గుంతకల్‌ మండలం, పాతకొచ్చేరుకు చెందిన యోగి అలియాస్‌ యాగంటయ్య (25) ఎలక్ట్రీషియన్‌. సంవత్సరం క్రితం ఓ యువతిని ప్రేమించగా ఆమె పెండ్లికి నిరాకరించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉంటున్న కూతురు రమణమ్మ కుమార్తె అరుణ అలియాస్‌ గాయత్రి (22)తో ఈ సంవత్సరం మే 13న... యాగంటయ్యను బలవంతంగా ఒప్పించి వివాహం చేశారు. నెల రో జుల పాటు  స్వగ్రామంలోనే కాపురం చేశారు. అనంతరం మియాపూర్‌లోని గోకుల్‌ప్లాట్స్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కుటుంబ సభ్యులు ఇష్టంలేని పెండ్లి చేశారని మనస్తాపంతో ఉన్న యాగంటయ్య... పెండ్లినాటి నుంచి భార్యను తరచూ వేధించసాగాడు. దీంతో ఏలాగైన ఆమె అడ్డును తొలగించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి భార్య గొంతు నులిమి చంపేశాడు. అనంతరం భయాందోళనకు గురై.. బాత్రూంలోని ఫినాయిల్‌ తాగి , చేతులను బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఇంకా తలుపులు తీయకపోవడంతో పక్కనే నివాసం ఉంటున్న స్థానికులు తలుపులు కొట్టగా ఎంతకీ తీయలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి రక్తపు మడుగులో ఉన్న యాగంటయ్యను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. గాయత్రి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.