కొడంగల్, జూలై 23 : ఏపీ జల దోపిడీపై రేవంత్‌రెడ్డి నోరు మెదపడంలేదని, దీనిపై ప్రభుత్వాన్ని నిలదీద్దామని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ పిలుపునిచ్చారు. బుధవారం దౌల్తాబాద్‌లోని ప్రభుత్వ కళాశాలలో బనకచర్ల ప్రాజక్టు, ఏపీ ప్రభుత్వం అక్రమ నీటి దోపిడీపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సారథ్యంలో నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా తెలంగాణ ఉద్యమం జరిగిందని, రాష్ట్ర సాకారం తరువాత తెలంగాణ పచ్చటి మాగాణిగా మణిహారంగా ఏర్పడిందన్నారు. కాగా ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి నది నుంచి 200ల టీఎంసీల నీటిని అక్రమంగా తరలించేందుకు కుట్రలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణకు నీటి ఇబ్బందులు ఏర్పడే ఏపీ కుట్రలపై రేవంత్‌రెడ్డి నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీ కుట్రను తిప్పికొట్టే ప్రయత్నం చేపట్టకుండా ఏపీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నట్లు ఆయన ఆరోపించారు.
కేసీఆర్ నీటి హక్కుల కోసం జంగ్ సైరన్ మోగిస్తే, ప్రస్తుత సీఎం ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం ఏంటని ప్రశ్నించారు. బనకచర్ల ద్రోహానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్దఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గోదావరి, కృష్ణా నదుల యాజమాన్య బోర్డులు, కేంద్ర జల సంఘం అనుమతులు లేకుండా అపెక్స్ కౌన్సిల్లో చర్చ జరపకుండా ప్రాజక్టు నిర్మించరాదని, కానీ ఏపీ సీఎం ఇవేవీ లెక్క చేయకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విజన చట్టాన్ని తుంగలో తొక్కుతూ బనకచర్ల ప్రాజక్టు నిర్మాణానికి సన్నాహాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ అక్రమ ప్రాజక్టును అడ్డుకోవాల్సిన బీజేపీ.. పూర్తి సహకారం, ప్రాజక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు అందించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్వీ పెద్దఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు వెంకటమ్మ, మహిపాల్, మధుసూదన్‌రెడ్డి, అశోక్, ఆశప్ప, సంతోష్‌కుమార్, బాలరాజ్, రమేశ్, వెంకటేశ్, వెంకటప్ప, రవీందర్‌రెడ్డి, కేశవులు, బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు.