అభివృద్ధి, తలసరి ఆదాయంలోనూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అగ్రగామిగా నిలిచింది. టీఎస్ఐపాస్ ఏర్పాటుతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కింది. భారీ పెట్టుబడులతో పెద్దపెద్ద కంపెనీలు నెలకొల్పగా, ఎంతో మందికి ఉపాధి లభించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుతో కరువు కనుమరుగుకానున్నది. ఉద్దండాపూర్ రిజర్వాయర్ కింద ఉమ్మడి జిల్లా పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టుకు సాగు నీరందనున్నది. పాలమూరు ఎత్తిపోతలతో కరువు ప్రాంతాలకు సైతం పుష్కలంగా కృష్ణా జలాలు అందనున్నాయి. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణాలతో ప్రజలకు పాలన చేరువైంది.
పల్లె, పట్టణ ప్రగతి, రైతు వేదికలు, మన ఊరు-మన బడి , మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఉచిత విద్యుత్, రోడ్ల నిర్మాణాల వంటి అద్భుతమైన అభివృద్ధి పథకాలతో రెండు జిల్లాల రూపురేఖలు మారాయి. రైతుబంధు, రైతుబీమా, చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ ఫలాలు ప్రతి పల్లెకూ అందాయి. ఎన్ని ప్రకృతి విపత్తులు ఏర్పడినా.. సంక్షోభంలోనూ ‘ప్రగతి’ రథం సాగింది. వైద్య రంగానికీ బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల మంజూరు, నర్సింగ్, ఆయుష్ కాలేజీలు, మాతాశిశు ఆసుపత్రితోపాటు బస్తీ, పల్లె దవాఖానలతో ఉమ్మడి జిల్లావాసులకు మెరుగైన వైద్యసేవలందాయి. అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా చెక్కుచెదరని అభివృద్ధి జరిగింది.
– రంగారెడ్డి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ)
KTR | రంగారెడ్డి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ‘ప్రభుత్వమంటే ఇలా ఉండాలి.. పాలన ఇలా సాగాలని ప్రతి వ్యక్తి కోరుకున్న విధంగానే తొమ్మిదిన్నరేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమం నిర్విఘ్నంగా సాగింది. అభివృద్ధి పనుల కోసం ఎదురు చూసే పరిస్థితులు మారాయి. పల్లె ప్రగతితో పల్లెల రూపురేఖలే మారిపోయాయి. ఎన్ని ప్రకృతి విపత్తులు ఏర్పడినా.. సంక్షోభ పరిస్థితులు వెంటాడినా.. సంక్షేమం, అభివృద్ధి జిల్లాలో జోరుగా సాగింది. కరువు ఛాయలను తుడిపేసేందుకు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సాకారంలోకి వచ్చింది.
అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. ఎంత విషం చిమ్మినా.. పరిపాలనలో ఆత్మైస్థెర్యం సడలక.. రాష్ట్రం ఏర్పాటు నుంచి నేటి వరకు పాలనలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని రంగారెడ్డి జిల్లా అభివృద్ధి పరంగా ముందు వరుసలో నిలిచింది. పారిశ్రామిక ప్రగతితో జిల్లా కొత్త పుంతలు తొక్కడమే కాదు.. తలసరి ఆదాయంలోనూ జిల్లా రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా తొమ్మిదిన్నరేండ్ల కాలంలో సాధించిన ప్రగతి, సృష్టించిన ఆస్తులపై ‘స్వేద’ పత్రాన్ని విడుదల చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీవీలు, సెల్ఫోన్లకు అతుక్కుపోయిన జనం ఆసక్తిగా వీక్షించారు.
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ 2015 జూన్ 11న శంకుస్థాపన చేశారు. అయితే ఎత్తిపోతలను అడ్డుకునే కుట్రలో భాగంగా ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేయడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో ఈ ఏడాదిఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు రావడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌లో కేసీఆర్ ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించారు. రూ.26,738కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ఎత్తిపోతలతో కరువు ప్రాంతాలకు పుష్కలంగా కృష్ణాజలాలు అందనున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్, నల్లగొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట్ జిల్లాల్లోని 12.3లక్షల ఎకరాలకు సాగు నీరందడంతోపాటు, 1,228 గ్రామాలకు తాగునీరు అందనున్నది.
పరిశ్రమల అవసరాలకు నీరందించడమే కాకుండా జంట నగరాలకు 50 ఏండ్ల నీటి భరోసాను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఉదండాపూర్ రిజర్వాయర్ కీలకం కాగా.. ఈ రిజర్వాయర్ కిందనే అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 6 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు సాగు నీరందనున్నది. ఉమ్మడి జిల్లాలోనే 1,100 చెరువులను ఈ ఎత్తిపోతల నీటితో నింపనున్నారు. ఇప్పటికే కెనాల్స్ నిర్మాణాలకు ప్రభుత్వం టెండర్లను సైతం పిలిచింది. అన్ని అనుకూలిస్తే ఉదండాపూర్ రిజర్వాయర్‌కు ఈ ఏడాది డిసెంబర్ నాటికే నీరు అంది.. కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఉమ్మడి రంగా జిల్లాలోని బీడు భూముల్లో కృష్ణమ్మ పరుగులు తీసే అవకాశం ఉండేది.
రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ క్లస్టర్‌కు ఒక్కటి చొప్పున 83 రైతు వేదికలు ఏర్పాటయ్యాయి. ప్రతి వేదికకు రూ.22లక్షలను ఖర్చుపెట్టి మొత్తంగా రూ.18.26కోట్లను రైతు వేదికల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వెచ్చించింది. జిల్లాలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో 468 పాఠశాలలు ఎంపికకాగా.. 448 పాఠశాలలకు రూ.97.88కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతులు కల్పించేందుకు పరిపాలన అనుమతులను ఇచ్చింది. 65 పాఠశాలల్లో పనులు పూర్తయి పునః ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు జిల్లాలో కేవలం 21 మాత్రమే గురుకులాలు ఉండగా..స్వరాష్ట్రంలో కొత్తగా 59 గురుకులాలు ఏర్పాటయ్యాయి. ప్రత్యేకించి మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరులో రెసిడెన్షియల్ లా కాలేజీని ఏర్పాటు చేసింది. ఒక్కో గురుకుల విద్యార్థిపై రూ.1.25లక్షలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చుచేసింది.
తెలంగాణ రాష్ట్ర సాధనకు తన ప్రాణాలను పణంగా పెట్టిన నాయకుడు కేసీఆర్. రాష్ట్రంలోని వర్గాలను ఆలోచింపజేసి, దేశంలోనే అన్ని పార్టీలను ఏకంచేసి, కేంద్రంలోని అధికార పార్టీ కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్. వచ్చిన రాష్ర్టాన్ని ఈ దివాలకోరు నాయకులకు అప్పజెప్పి ఉరుకుంటే తెచ్చిన తెలంగాణ రాష్ర్టానికి ఉపయోగం లేదని బాగా ఆలోచించి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరుతో రాజకీయ పార్టీగా ఏర్పాటు చేసి ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన 3గంటల కరెంటు చాలదని అనుకుని రైతులకు 24గంటల కరెంట్ కోసం పక్క ప్రణాళికలు సిద్ధం చేసి అమల్లోకి తెచ్చిన నాయకుడు కేసీఆర్. అదే ఆలోచనతో రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఇంటింటికీ తాగు నీరు అందించాలని మిషన్ భగీరథ పథకం అమలు చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మాత్రం ప్రజలకు అన్ని అబద్దాలు చెబుతూ, అంకెల గారడితో ప్రజలకు రాష్ట్రం మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది. ఇక మేము ఏమి చేయలేమని, వారిచ్చిన హామీలను తుంగలో తొక్కే ఆలోచన చేస్తున్నది. వారొచ్చిన పక్షం రోజుల్లోనే మాటిచ్చిన నిరుద్యోగ భృతికి ఎగనామం పెట్టేశారు. అసెంబ్లీలో వారు ప్రవేశపెట్టిన శ్వేత పత్రాలు అంకెల గారడి, అబద్దాల పుట్ట. దానికి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా అధికార పక్షం అసెంబ్లీని వాయిదా వేసి పారిపోయింది.
– మాధవగౌడ్, చేవెళ్ల మండలం, కమ్మెట గ్రామం
పరిగిటౌన్, డిసెంబర్ 24 : తొమ్మిదిన్నర ఏండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి ఆదివారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడాన్ని చాలా గ్రామాల్లో యువకులు, పార్టీ అభిమానులు టీవీల ముందు కూర్చొని ఆసక్తిగా తిలకించారు. రైతులకు సాగు నీరందించి చెరువులు, ప్రాజెక్టులను అభివృద్ధి పర్చిన ప్రభుత్వాన్ని ప్రశంసించకుండా అప్పుల పాలు చేసిందని బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నాలను కాంగ్రెస్ప్రభుత్వం మానుకోవాలని పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన మహేందర్ సూచించారు. గతంలో వలసలు ఉండే పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసి వలసలు పోకుండా చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి రైతులను ఆదుకున్నారన్నారు. కేటీఆర్ ఐటీ శాఖమంత్రిగా పనిచేసిన సమయంలో హైదరాబాద్ ఐటీని ఎంత అభివృద్ధి చేశాడో ప్రజలకు తెలుసని అభివృద్ధిపై రాజకీయాలు చేయరాదన్నారు.
తొమ్మిదిన్నరేండ్లలో సాధించిన ప్రగతి, సృష్టించిన ఆస్తుల వివరాలతో స్వేద పత్రం ద్వారా తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వివరించడంతో రంగారెడ్డి జిల్లాలో జనం టీవీలతోపాటు సెల్ఫోన్లకు అతుక్కుపోయారు. లైవ్ వస్తున్నంత సేపు షాపులు, హోటళ్లు ఇలా ఎక్కడికక్కడ వీక్షించారు. ప్రముఖులు సైతం కేటీఆర్ పవర్ ప్రజెంటేషన్‌ను ఆసక్తిగా వీక్షించారు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి ఏమిటి? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం ఏమిటి? వంటి ఎన్నో అంశాలను కేటీఆర్ ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా వివరించడం అందరినీ ఆకర్షించింది. కేటీఆర్ చెప్పిన ప్రతి మాటనూ స్వాగతించడంతోపాటు జిల్లా సమగ్ర అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనలేని బాటలు వేసిందని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడ్డారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందనడంలో అతిశయోక్తి లేదు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలు, పేదల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు ఏమాత్రం సరికావు. రాష్ర్టాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందనడం సరికాదు. గతంలో పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇది ఎంతవరకు సమంజసమో వారికే అర్థమవ్వాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడుదల చేసిన స్వేద పత్రంలో రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడిన అంశాలను క్లియర్‌గా వివరించారు. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ నాయకుల తీరు మారాలి.
– కెప్టెన్ అంజన్‌గౌడ్, ప్రభుత్వ కళాశాల రిటైర్డ్ ్రప్రిన్సిపాల్, అంతారం, చేవెళ్ల
దోమ, డిసెంబర్ 24: తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదని సర్పంచ్ల సంఘం దోమ అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. అసెంబ్లీ సెషన్స్‌లో అధికార పార్టీ సీఎం రేవంత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేసి గత పాలకుల హయాంలో తెలంగాణ అప్పుల కుప్పగా మారిందన్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని స్వేదపత్రం పేరుతో తెలంగాణ భవన్లో ఆదివారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్న ప్రసంగాన్ని దోమ మండల కేంద్రంలో తన నివాసంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి టీవీలో వీక్షించి అట్టి విషయమై స్పందించిన ఆయన తొమ్మిదిన్నర ఏండ్ల లో తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యయనమని తెలుపుతూ తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టానికి బీఆర్ఎస్ పార్టీ సృష్టించిన సంపదను తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా కేటీఆర్ స్వేద పత్రం రిలీజ్ చేశారన్నారు.