రంగారెడ్డి, మే 1 (నమస్తే తెలంగాణ) : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో గులాబీ దండు కదం తొక్కుతున్నది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల తరఫున గులాబీ దళం ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నది. మరోపక్క పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యనేతలంతా సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జనంలో బీఆర్ఎస్పై పెరుగుతున్న పాజిటివ్ వేవ్‌తో అటు నేతలు, ఇటు పార్టీ శ్రేణులు సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలను గడపగడపకూ వివరించడంతోపాటు కాంగ్రెస్ ఐదు నెలల పాలనలోని వైఫల్యాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి మరోసారి మోసపోవద్దని, కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలకు వివరిస్తున్నారు.
చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్, నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్, మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిలు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డితోపాటు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎంపీ అభ్యర్థులకు మద్దతుగా సభలు, సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లను నిర్వహిస్తున్నారు.
కుల సంఘాలు, మత పెద్దలతో ఆత్మీయ సమ్మేళనాలు, సభలు నిర్వహిస్తూ మద్దతు కూడగడుతున్నారు. అన్ని చోట్లా ప్రచారానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తున్నది. ప్రచారానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో జోష్ నింపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణంగా డీలా పడిన క్యాడర్లో ప్రస్తుతం పూర్వ ఉత్సాహం కనిపిస్తున్నది. చేవెళ్లలో నిర్వహించిన కేసీఆర్ బహిరంగ సభ సైతం జిల్లాలో బీఆర్ఎస్కు పాజిటివ్ వేవ్‌ను మరింతగా పెంచింది. ప్రజల ఆదరణను చూసి బీఆర్ఎస్ నాయకులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అంచనాలను బీఆర్ఎస్ పార్టీ తలకిందులు చేసింది. కేసీఆర్ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు విశేష స్పందన వస్తుండడం.. కేసీఆరే కావాలని సబ్బండ వర్ణాలు కోరుకుంటుండడం.. ఆ రెండు పార్టీలను ఆత్మరక్షణలో పడవేశాయి. అధికారంలోకి రావడానికి అలవిగాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ మోసం చేసిందంటూ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కరువు పరిస్థితులతోపాటు కరెంటు, రైతుబంధు అమలులో కాంగ్రెస్ వైఫల్యం కావడంపై రైతాంగం భగ్గుమంటున్నది.
బీజేపీ సైతం ఆది నుంచి తెలంగాణపై వివక్షను చూపిస్తూ వచ్చిందని, అన్ని ధరలు పెంచి ఆగం చేసిందని ప్రజానీకం అసహనం వ్యక్తం చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్న భావన ప్రజల నుంచి వినిపిస్తున్నది. కాంగ్రెస్, బీజేపీల కంటే కేసీఆరే నయమని, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలువాలని ప్రజానీకం కోరుకుంటున్నది. సర్వే ఫలితాలు సైతం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాకు అనుబంధంగా ఉన్న అన్ని ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధిస్తామన్న ధీమా గులాబీ క్యాడర్లో నెలకొన్నది. ఈక్రమంలోనే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాను చాటేందుకు క్యాడర్ ఉత్సాహంగా పని చేస్తున్నది.