వికారాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ఎజెండాగా బీఆర్ఎస్ ముందుకెళ్తున్నది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లోనూ జిల్లా పరిషత్, మండల పరిషత్‌లపై గులాబీ జెండా ఎగురవేసేలా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీకి గట్టిగా షాక్ ఇచ్చేలా జిల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలో జిల్లా అంతటా మండలాలవారీగా బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల్లో గెలుపొందేందుకు సమాయత్తం చేయనున్నారు. పూర్తికాని రుణమాఫీ, అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు తదితర వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం చేయనున్నది.
జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆశావహులు ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉంటూ తమకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా బరిలో దింపే వారిలో స్థానికంగా ప్రజల్లో మంచి గుర్తింపు ఉండటంతోపాటు బలమైన అభ్యర్థినే స్థానిక సంస్థల బరిలోకి దింపేందుకు బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నది. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు దీటుగా బలమైన అభ్యర్థులనే పోటీలో దింపేందుకు అన్ని విధాల బీఆర్ఎస్ ఆలోచన చేస్తున్నది. కాంగ్రెస్ సర్కారుపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత ఉండటం, ప్రజల్లో అసంతృప్తి ఉండడంతో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతున్నది. గత ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల స్థానాలు పెరిగాయి. గత ఎన్నికల్లో 18 జడ్పీటీసీ, 18 ఎంపీపీ, 221 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. ఈసారి 20 జడ్పీటీసీ, 20 ఎంపీపీ, 227 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా బీఆర్ఎస్ వ్యూహాలు చేస్తున్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన గత ఏడాదిన్నర కాలంగా గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు నయా పైసా మంజూరు చేయకపోవడంతోపాటు స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ సర్కారు వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛత, అభివృద్ధిలో జాతీయ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకున్న గ్రామపంచాయతీలు ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి, సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి.
కనీసం గ్రామపంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ కూడా పోసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయకపోవడంతో మూలన పడిన పరిస్థితికి తీసుకువచ్చారు. అర్హులకు ఇంకా పూర్తికాని రుణమాఫీ, మూడు సీజన్లు పూర్తైనా కేవలం ఒక్క సీజన్లోనే అందరికీ పెట్టుబడి సాయం అందించి, రెండు సీజన్లలో పెట్టుబడి సాయం అందజేయకుండా రైతులను అప్పులపాలు చేయడం, పెట్టుబడి సాయాన్ని రూ.16 వేలకు పెంచుతామని హామీనిచ్చి విస్మరించడం, ఆసరా పింఛన్ల పెంపు చేపట్టకపోవడం, మహిళలకు ఆర్థిక సాయం, అనర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, అర్హులకు అన్యాయం చేయడం తదితర సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా జిల్లా బీఆర్ఎస్ యంత్రాంగం శ్రేణులను సమాయత్తం చేయనున్నారు.
మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, కొప్పుల మహేశ్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు, రైతు సమస్యలు, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాకపోవడం, ఆసరా పింఛన్ల పెంపు చేపట్టకపోవడం తదితర అంశాలపై మాజీ మంత్రి సబితారెడ్డి తదితర ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పోరాడుతున్నారు. సబ్బండ వర్గాలకు అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుపై ఏడాదిలోపే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కష్టనష్టాలు లేకుండా ఉన్న సబ్బండ వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కష్టాలు మొదలవడంతో అన్ని వర్గాల ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేలా బీఆర్ఎస్ పార్టీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నది. అన్ని జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీల స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసేలా గెలుపు గుర్రాలనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బరిలో దించేలా మాజీ మంత్రి సబితారెడ్డి దిశానిర్దేశంతో ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు కసరత్తు మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 18 జడ్పీటీసీ, 18 ఎంపీపీ, 221 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగగా.. బీఆర్ఎస్ పార్టీ 137 ఎంపీటీసీ, 16 జడ్పీటీసీ, 16 ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకున్నది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దేముల్, బంట్వారం మండలాలు మినహా అన్ని మండలాల్లోనూ గులాబీ జడ్పీటీసీలే గెలుపొందారు.