వికారాబాద్, డిసెంబర్ 20 : కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తున్నారనే కుట్రతోనే రేవంత్‌రెడ్డి.. కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టించారని బీఆర్ఎస్ కౌన్సిలర్ గోపాల్ మండిపడ్డారు. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ సూచనల మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించి, సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ ర్యాలీ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఇంటి నుంచి పట్టణంలోని ఆటో స్టాండ్ వరకు కొనసాగింది. మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే భైఠాయించి ధర్నా చేశారు.
అనంతకం బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టులు చేసి వ్యాన్‌లో వికారాబాద్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ ఈ-రేస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచారన్నారు.
రాష్ర్టానికి దాదాపు రూ.700 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫార్ములా ఈ-రేస్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయలేక విఫలమయ్యారన్నారు. చేతనైతే కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం, రూ.6 వేల పింఛన్, మహిళలకు రూ.2,500లు, రైతులందరికీ రుణ మాఫీ, రైతు బంధు, సమగ్ర శిక్షా ఉద్యోగుల రెగ్యులరైజ్ తదితర వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని నమ్మించి ప్రజలతో ఓటు వేయించుకున్నదని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్‌ను పెంచిన కేటీఆర్‌పై కక్షగట్టి ఏసీబీలతో కేసు పెట్టించడం సరికాదన్నారు. ధర్నాలో వికారాబాద్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు గయాజ్, బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేందర్‌గౌడ్, జిల్లా నాయకులు సురేశ్, అశోక్, ఆనంద్, అనీల్, నర్సింహులు, ఆంజనేయులు, మల్లేశ్, గఫార్, శ్రీనివాస్‌గౌడ్, అనంతయ్య, మహిపాల్ పాల్గొన్నారు.