రంగారెడ్డి, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు నిరసనగా.. అన్నదాతకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నేడు ఆమనగల్లులో రైతు నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ దీక్షకు కోర్టు షరతులతో కూడిన అనుమతులివ్వగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చే అవకాశమున్నది.
కేటీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు తుక్కుగూడకు చేరుకుంటారు. అక్కడ మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి.. వేలాది కార్లతో ఆమనగల్లు వ రకు ర్యాలీగా రానున్నారు. 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆమనగల్లులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 12 గంటలకు రైతు నిరసన దీక్ష ప్రారంభం కానున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
వాహనాల పార్కింగ్, తాగునీరు, ఇతరత్రా అన్ని సౌకర్యాలను కల్పించారు. దీక్ష విజయవంతానికి మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, అంజయ్యయాదవ్, నాయకులు పట్నం అవినాశ్‌రెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు కృషి చేస్తున్నారు.
జిల్లాలో ఇప్పటికే షాబాద్‌లో రైతు దీక్ష నిర్వహించగా అది సక్సెస్ అయ్యింది. అలాగే మంగళవారం రెండో రైతుదీక్షను ఆమనగల్లులో నిర్వహిస్తున్నారు. దీనిని కూడా విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు గతవారం రోజులుగా కృషిచేస్తున్నారు.
మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ నుంచి ప్రారంభమయ్యే కేటీఆర్ ర్యాలీకి అడుగడుగునా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. తుక్కుగూడ నుంచి బయలుదేరిన కేటీఆర్ కందుకూరులో పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. అలాగే, కడ్తాల్లోనూ పార్టీ జెండాను ఎగురవేసి ఆమనగల్లుకు చేరుకుంటారు. ఆమనగల్లు మున్సిపాలిటీకి చేరుకోగానే అక్కడి నుంచి భారీ ర్యాలీతో సభాస్థలికి చేరుకోనున్నారు.