వికారాబాద్/రంగారెడ్డి, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): వరంగల్‌లో జరిగిన రజతోత్సవ మహాసభ ఊహించిన దానికంటే గ్రాండ్ సక్సెస్ అయింది. ఎల్కతుర్తి సభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి తరలివచ్చిన లక్షలాది మంది కార్యకర్తల్లో కొత్త జోష్ నింపింది. బహిరంగ సభకు వచ్చిన భారీ జన సందోహంతో గులాబీ శ్రేణులు ఉద్యమకాలం నాటి ఉద్వేగానికి లోనయ్యారు.
అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగంతో ఆత్మవిశ్వాసం నిండిందని.. కాంగ్రెస్ పాలనలోని వైఫల్యాలను ఎండగట్టి ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరుకు సిద్ధం కావాలని ఇచ్చిన పిలుపు తమకెంతో స్ఫూర్తినిచ్చిందని.. పలువురు నాయకులు, కార్యకర్తలు పేర్కొంటున్నారు. రేవంత్ సర్కార్ గత 16 నెలలుగా వివిధ కేసులతో భయపెడుతున్నా.. కాంగ్రెస్ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు.
అదేవిధంగా ఎల్కతుర్తి సభకు వెళ్లే ముందు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని గ్రామాలు, వార్డుల్లో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, కల్వకుర్తి, షాద్‌నగర్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్.. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని ప్రతి గ్రామంలోనూ గులాబీ జెండాలను ఎగురవేసి, పార్టీ ఆవిర్బావ దినోత్సవాన్ని పండుగలా నిర్వహించారు.
బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం..
25 వసంతాల బీఆర్ఎస్ పార్టీ పండుగను పురస్కరించుకొని ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగలో అధినేత కేసీఆర్ ప్రసంగం ప్రతి కార్యకర్తనూ కదిలించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సబ్బండ వర్ణాలు పడుతున్న కష్టాలను గుర్తు చేసిన గులాబీ బాస్, ఏడాదైనా సమయం ఇవ్వాలని వేచి చూశామని.. ఎక్కడ పొగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాల్సిన సమయం ఆసన్నమైందని..
కడుపు కట్టుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచితే కాంగ్రెస్ పార్టీ రాగానే దివాలా తీయడం బాధగా ఉందని పేర్కొనడంతోపాటు కేసులకు భయపడొద్దని, మీకు అండగా మేము ఉంటామని.. అన్ని వర్గాలకు అండగా ఉండి ముందుకెళ్లి, మళ్లీ గులాబీ జెండాను ఎగురవేయాలన్న కేసీఆర్ ప్రసంగంతో బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమ కాలం నాటి ఉద్వేగానికి లోనయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంతో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే అంటూ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టి..
అలవి కాని హామీలిచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అన్యాయం చేయడంపై ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ పాలనపై మండిపడ్డా రు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయానికి 24 గంటల కరెంట్, రైతు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతు బీమా, అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధు, ఇంటింటికీ నల్లాల ద్వా రా మిషన్ భగీరథ తాగునీరు, చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు మిషన్ కాకతీయ లాంటి పలు పథకాలను అమలు చేసి బంగారు తెలంగాణలా తీర్చిదిద్దామని కేసీఆర్ గుర్తు చేశారు.
అయితే, దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా నట్టేట ముంచడంతోపాటు కరెంట్ కష్టాలు మొదలయ్యాయని, ఊరూరా తాగునీటి కోసం బిందెలతో మహిళలు కిలోమీటర్ల మేర వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని.. అవినీతి పెరిగిపోయిందని, ఇలా పలు అంశాలపై కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టారు.
ఇది ఆరంభం మాత్రమే..
– డాక్టర్ మెతుకు ఆనంద్, బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు
ఎల్కతుర్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇది ఆరంభం మాత్రమే..రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాల వేడుకలకు సంబంధించి మరిన్ని వేడుకలను నిర్వహిస్తాం. ఇక నుంచి అడగడుగునా ప్రజా సమస్యలపై పోరాడి, ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెం చుతాం. అదేవిధంగా, కాంగ్రెస్ పాలకులు సభను అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు లక్షలాదిగా తరలివచ్చారు. సభ సక్సెస్ కావడంతో భాగస్వాములైన నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు
తరలివచ్చి.. సక్సెస్ చేసి..
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లోని వార్డుల్లో గులాబీ జెండాలను ఆవిష్కరించి వరంగల్ సభకు భారీగా తరలివచ్చి సక్సెస్ చేసిన కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. గులాబీ గుబాలింపును, అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని నేరుగా టీవీలు, సోషల్ మీడియాలో ఆసక్తిగా వీక్షించిన కోట్లాది మంది తెలంగాణవాదులకు, మమ్ముల్ని ప్రోత్సహించిన ప్రతినిధులకు శత కోటి వందనాలు. రజతోత్సవ సభ విజయోత్సవ ఉత్తేజంతో తల్లి తెలంగాణ కు పునర్వైభవాన్ని తీసుకొచ్చేందుకు కదనోత్సాహంతో పనిచేద్దాం.
-మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ నాయకుల్లో వణుకు పుట్టించింది..
రజతోత్సవ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో వణుకు పుట్టించింది. వరంగల్ సభ జనసంద్రంతో మరో చరిత్రను సృష్టించింది. పార్టీ రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఊరూవాడల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ జెం డాలను ఆవిష్కరించడంతో పండుగ వాతావర ణం నెలకొంది. ప్రత్యేక వాహనాల్లో సభకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు ప్రజలు, అభిమానులు చూపిన ఉత్సాహం చాలా సంతోషం గా ఉన్నది.
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని ఈ బహిరంగ సభతో స్పష్టమైంది. కాంగ్రెస్ పాలనలో కరువు తప్పదని, సంక్షేమం కుంటుపడుతుందని ప్రజలు గ్రహించారు. రానున్నది మనదే ప్రభుత్వమని పార్టీ అధినేత కేసీఆర్ ఆనగానే వీక్షకుల చప్పట్లు, అరుపులు, కేకలతో సభాప్రాంగణం దద్దరిల్లింది. కేసీఆర్ ప్రసంగంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొన్నది. సభ సక్సెస్‌కు సహకరించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు.
-పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ మ్మెల్యే కొడంగల్
రజతోత్సవ మహాసభ సక్సెస్
వరంగల్‌లో జరిగిన బహిరంగ సభ ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతమైంది. ప్రతి గ్రా మం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఎక్కడ చూసినా ఎల్కతుర్తి సభ సక్సెస్‌పైనే చర్చించుకుంటున్నారు. అధికార పార్టీపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదో ఈ మహాసభ జయప్రదం కావడం ద్వారా తేటతెల్లమైంది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగం స్వయంగా వినాలనే ఉత్సాహంతో వేలాది మంది సభకు తరలివచ్చారు. పార్టీ ఏర్పాటు నుంచి పదేండ్లలో తెలంగాణను ఎంత అభివృద్ధి చేసింది కేసీఆర్ చక్కగా వివరించారు.
గత పదహారు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని రంగాల్లో ఫెయిలైందని కేసీఆర్ చెప్పగా సభకు వచ్చిన వారంతా అవునని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. భవిష్యత్తులోనూ ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా పోరాడుతామని.. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పడం ద్వారా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించారు. రజతోత్సవ సభకు పరిగి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు. -కొప్పుల మహేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పరిగి
పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం
రజతోత్సవ సభతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నిండింది. దొంగ హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధినేత ఎండగట్టారు. కేసులకు భయపడొద్దు.. అండగా ఉంటామంటూ కేసీఆర్ ఇచ్చిన భరోసాతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారు.. త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగురడం ఖాయం.
– పైలట్ రోహిత్‌రెడ్డి, తాండూరు మాజీ ఎమ్మెల్యే