వికారాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఘోష్ కమిషన్ కాదు.. ట్రాష్ కమిషన్ అని, సీబీఐ కాదు ఏ సంస్థలకు అప్పజెప్పినా మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు కడిగిన ముత్యంలా బయటకొస్తారని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలకు నిరసనగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ చౌరస్తాలో మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీ, ఐటీని అప్పొజిషన్ ఎలిమినేషన్ సెల్ అని రాహుల్‌గాంధీ చెప్తుం టే.. రాహుల్‌గాంధీకి చేదుగా అనిపించే ఇదే సీబీఐ రేవంత్‌రెడ్డికి తియ్యగా ఎట్లా అనిపిస్తున్నదని ప్రశ్నించారు. మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన రెండు, మూడు పిల్లర్లకు మరమ్మతులు చేయకుండా మొత్తం రిజర్వాయర్‌ను నాశనం చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ఆరోపించారు. కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేసేందుకు ఎల్అండ్టీ సంస్థ సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిందే రూ.94 వేల కోట్ల కంటే తక్కువ అని.. రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా అవుతుందని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ తీరును పరిశీలిస్తున్న ప్రజలంతా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం తథ్యమన్నారు. ఆదివారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్, హరీశ్‌రావును ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని శతవిధాలా యత్నించిన రేవంత్ సర్కార్‌కు హరీశ్‌రావు విశ్వరూపాన్ని చూపించారన్నారు.
అదేవిధంగా బీఆర్ఎస్ను దోషిగా నిలబెట్టాలని ఘోష్ కమిషన్ పేపర్లు తీసి ఉమభారతి ఇచ్చిన నివేదికను సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించగా.. హరీశ్‌రావు ప్రతి పేజీని చదివి ప్రభుత్వానికి దిమ్మదిరిగే సమాధానం ఇచ్చారన్నారు. అదేవిధంగా జిల్లాలో ఎక్కడ చూసినా యూరియా కొరత ఉందని, ఇతర జిల్లాల్లో వరదలొచ్చాయని, ప్రభుత్వం మాత్రం ఆగమేఘాల మీద ఆదివారం అసెంబ్లీని పెట్టి ప్రజలు పడుతున్న యూరియా, వరదల సమస్యలపై మాట్లాడకుండా.. ఘోష్ కమిషన్‌పై చర్చించడంపై మండిపడ్డారని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధం : శుభప్రద్‌పటేల్
ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్‌ను బొందపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ అన్నారు. సీబీఐ, ఈడీ విచారణకు భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదన్నారు. గతంలో ఆంధ్రా, రాయలసీమ ప్రాంతానికి ఉమ్మడి పాలకులు గోదావరి, కృష్ణ జలాలను తరలించుకుపోతే.. కేసీఆర్ అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేండ్లలోనే నిర్మించి సాగు నీరందించారన్నారు.
కాళేశ్వరంలాంటి పెద్ద ప్రాజెక్టును నిర్మిస్తే కాళేశ్వర కమిషన్ అని కేసీఆర్, హరీశ్‌రావును పిలిచి, ఇప్పడు కమిషన్ రిపోర్టు చూస్తే దోషిలాగా చేశారన్నారు. ఘోష్ కమిషన్‌పై పునఃపరిశీలన లేకుండా నిందలు మోపే వారికి జవాబు చెప్పే పరిస్థితి లేకుండా (సెక్షన్ 8 బి, సి)ని తుంగలో తొక్కారని.. హైకోర్టులో కాళేశ్వర కమిషన్ రిపోర్టును కొట్టేసే అవకాశాలున్నాయనే ఉద్దేశంతోనే అర్ధరాత్రి సీబీఐకి అప్పగిస్తూ అసెంబ్లీలో సీఎం ప్రకటించారన్నారు. నిరసనలో బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణాధ్యక్షుడు గోపాల్, మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పురుషోత్తం రెడ్డి, అశోక్, దత్తు తదితరులు పాల్గొన్నారు.