ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 5 : ఫార్మా భూబాధిత రైతులకు ప్లాట్ల పొజిషన్ చూపించిన తర్వాతే ఫార్మా భూములకు కంచెను ఏర్పాటు చేయాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల్లోని మేడిపల్లి, నానక్‌నగర్, కుర్మిద్ద, తాటిపర్తి, నక్కర్తతో పాటు పలు గ్రామాల్లో రైతుల నుంచి సేకరించిన భూములకు కంచె వేసేందుకు కాంగ్రెస్ సర్కారు మూడు నాలుగు వందల మంది పోలీసులను పెట్టి కంచె వేయిస్తూ రైతులను అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతులకు భూ పరిహారంతో పాటు ఇంటి స్థలాలను కూడా అందజేసేందుకు ఒప్పందం కుదిరిందన్నారు.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దాటవేత ధోరణి అవలంబించడం సరికాదన్నారు. అలాగే, ఫ్యూచర్ సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫీల్డ్ రోడ్డు భూ బాధితులకు పరిహారం ధర నిర్ణయించకుండానే టెండర్లు పిలవటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎలాంటి ఇబ్బందులున్నా సామరస్యంగా రైతులతో మాట్లాడి పరిష్కరించాలని.. అంతేకాని అమాయకపు రైతులు, ప్రజల పట్ల పోలీసు జులుం ప్రదర్శిస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. నిన్న మొన్నటి వరకు హెచ్‌సీయూ, లగచర్ల భూముల విషయంలో చేసిన మాదిరిగా ఇబ్రహీంపట్నం గడ్డపై ఇలాంటి చర్యలకు పాల్పడితే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గత ఎన్నికల సమయంలో భట్టివిక్రమార్క, సీతక్క, కోదండరెడ్డి, కోదండరాంరెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ప్రగల్బాలు పలికి ఇప్పుడు రైతులకు న్యాయం చేయకుండా.. ఇక్కడ ఫార్మా సిటీ లేక ఇంకేదైనా ఏర్పాటు చేస్తారా చెప్పకుండా దాగుడు మూతలు ఆడటం సరైన పద్ధతి కాదన్నారు. రైతులకు న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులున్నారు.