ఇబ్రహీంపట్నం, మార్చి 1 : అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రలోభాలకు తలొగ్గి అధికారులు ఎన్ని తప్పుడు పనులు చేసినా.. అక్రమ కేసులు పెట్టినా ఏ మాత్రం వెనక్కి తగ్గేదేలేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ కౌన్సిలర్లతోపాటు పార్టీకి మద్దతిస్తున్న మరో ఇద్దరు కౌన్సిలర్లు, పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డితో కలిసి ఆయన ఆదివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ప్రజలు బీఆర్ఎస్కు పూర్తి మెజార్టీని ఇచ్చారని .. దానిని తట్టుకోలేక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేక ఎమ్మెల్యే రిటర్నింగ్ అధికారి, ఏసీపీని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
స్పష్టమైన కోరం ఉన్నా రిటర్నింగ్ అధికారి ఎమ్మెల్యే ఒత్తిడికి తలొగ్గి కాలయాపన చేసి చైర్మన్ ఎన్నిక ఫలితాన్ని ప్రకటించకుండా వాయిదా వేశారని ఆరోపించారు. ఏసీపీ ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేశారని, అయినా ఓపిక పట్టామన్నారు. మా మంచితనాన్ని చేతగాని తనంగా భావించి చిల్లరగా ప్రవర్తిస్తున్నారని, ఇక సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఏసీపీ, రిటర్నింగ్ అధికారి ఆగడాలపై న్యాయపోరాటం చేస్తామని, రాజ్యాంగబద్ధ సంస్థల్లో ఫిర్యాదులు చేసి పోరాడుతామన్నారు. బీఆర్ఎస్కు ఇప్పటికే 14 మంది అభ్యర్థుల మద్దతు ఉందని, మరో అభ్య ర్థి నేరుగా పార్టీలో చేరనున్నారని ఆయన వెల్లడించారు. ప్రజలిచ్చిన సంపూర్ణ మద్దతుతోనే మున్సిపల్ చైర్మన్, వైస్‌చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు భాస్కర్, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, చీరాల రమేశ్, బుగ్గరాములు, 14 మంది కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.