రంగారెడ్డి, జూలై 27 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుండటంతో ప్రధాన పార్టీల మధ్య రాజకీయ వేడి మొదలైంది. ముందుగా పార్టీ గుర్తులపై ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నది.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే ఓటర్ లిస్టుల సవరణ, పోలింగ్ బూత్ల గుర్తింపు ప్రక్రియ, బీఎల్వోల శిక్షణా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ప్రభుత్వం ఎప్పుడు ఆదేశాలిస్తే అప్పుడే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నది. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చన్న ఉద్దేశంతో ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
ఇప్పటికే బీఆర్ఎస్పార్టీ ఒకడుగు ముందుకేసి చేరికలకు తెరలేపింది. మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల వంటి నియోజకవర్గాల నుంచి ఇతర పార్టీల నాయకులను బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటున్నది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి బీసీ సంఘాల నాయకుడు, యాచారం మండలానికి చెందిన వెంకటేశంగౌడ్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే, మహేశ్వరం, కందుకూరు నియోజకవర్గాలతో పాటు బాలాపూర్, బడంగ్పేట్ కార్పొరేషన్ల నుంచి మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో చేరుతున్నారు.
చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, ఇతర పార్టీల నాయకులు సబితారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేరు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నది. ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పేరుతో గ్రామాల్లో శంకుస్థాపనలు చేస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలే ప్రచారాస్ర్తాలుగా..
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం, సంక్షేమ ఫలాలన్నీ పార్టీ నాయకులు, కార్యకర్తలకే అందిస్తూ పేద ప్రజలను విస్మరిస్తున్నారనే తదితర అంశాలను ప్రచారాస్ర్తాలుగా మార్చుకుని ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు అనర్హులకే ఇస్తున్నారని, పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా అర్హులకు అందడంలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రుణమాఫీ కూడా అందరికీ అమలు కాలేదని, రైతు భరోసా కూడా అర్హులందరికీ అందలేదనే విషయాలను ప్రధానాస్ర్తాలుగా మలుచుకోనున్నది.
రిజర్వేషన్లపై అయోమయం
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు త్వరలోనే ఖరారయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు త్వరలో కోర్టుకు అందజేయాల్సి ఉన్నందున ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు జరుపుతామని చెప్తున్నప్పటికీ అది ఎంతమేరకు అమలవుతుందోనన్నది ప్రశ్నార్థకంగా మారింది. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారా.. లేక కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకంలో భాగమా అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు.
గ్రామాల్లో మొదలైన దావత్లు
ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్న తరుణంలో గ్రామాల్లో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు యువతను తమవైపు తిప్పుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గ్రామాల్లో యువతకు సాయంకాలం వేళల్లో మద్యం, విందు పార్టీలు ఏర్పాటు చేసి తమవైపు తిప్పుకొంటున్నారు.