హైదరాబాద్ : కొన్నిరోజులుగా రాష్ట్రంలోనే సంచల నం రేకెత్తించిన నాదర్గుల్ భూముల వ్యవహారంలో నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలు మరో అడుగు ముందుకేశారు. నాదర్గుల్, కోహెడ మార్కెట్ భూముల పరిరక్షణ కోసం నేడు(శుక్రవారం) రంగారెడ్డి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. కాగా, రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలంలోని నాదర్గుల్ సర్వేనంబర్ 613లోని భూమి. 12 రోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న బాగోతానికి సంబంధించిన భూములివి. సాక్షాత్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సైతం రెండు రోజుల కిందట సచివాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి 373.22 ఎకరాలు ప్రభుత్వ భూములే అని ప్రకటించారు. ఆ భూములను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేస్తే ఇప్పుడు తామే రక్షిస్తున్నామనీ సెలవిచ్చారు. కానీ అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో తాజాగా ఓ బలమైన ఆధారం వెలుగులోకి వచ్చింది.
బీఆర్ఎస్ హయాంలో ఆ భూములను ప్రభుత్వానివిగా గుర్తిస్తూ ఏర్పాటు చేసిన హద్దు రాయి ఒకటి ‘నమస్తే తెలంగాణ’ కంటపడింది. ఆ హద్దు రాయిపై స్పష్టంగా ఆంగ్ల అక్షరాల్లో ప్రభుత్వ భూమి అని ఉన్నది. దాన్ని ఆనుకునే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు గతంలో అదనపు డైరెక్టర్‌గా ఉన్న ఏక్యూ స్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రేకులతో కంచె ఏర్పాటు చేసింది. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న నాదర్గుల్ రైతులను అందులోకి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నది. ఈ క్రమంలో రైతులు కొన్నిరోజులుగా అక్కడే వంటావార్పు చేసుకుంటూ తమ భూముల కోసం పోరాటం సాగిస్తున్నారు. అయినా అధికారులు, పోలీసుల అండదండలతో ప్రైవేట్ కంపెనీలు దర్జాగా రేకుల కంచె నిర్మించారు. ఎవరేం చేస్తారులే! అన్న ధీమాతో ప్రభుత్వ హద్దు రాయిని సైతం అట్లనే ఉంచారంటే ప్రభుత్వ వ్యవస్థలంటే ఎంత లెక్కలేనితనం ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.