రంగారెడ్డి, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : అసెంబ్లీలో మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి జిల్లా ప్రజానీకం భగ్గుమన్నది. ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఊరూరా రాస్తారోకోలు, ధర్నాలు చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సీఎం రేవంత్రెడ్డి, భట్టి విక్రమార్క దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాద్నగర్, మాడ్గుల తదితర మండలాలు, మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనను చేపట్టాయి. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తొలి మహిళా హోం మంత్రిగా, తెలంగాణ తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించిన సబితాఇంద్రారెడ్డిపై నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి చేసిన వ్యాఖ్యలు యావత్ తెలంగాణ ఆడబిడ్డలను అవమానించేలా ఉన్నాయని, వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలన తీరును ప్రజలు గమనిస్తున్నారని.. రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇప్పటికైనా మహిళలను గౌరవించే సంస్కృతిని నేర్చుకోవాలని హితవు పలికారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డికి సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా…
మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లావ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. జిల్లా కేంద్రం మొదలుకొని మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే సబితారెడ్డిని అవమానించేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మాజీ మహిళా మంత్రులను కించపరిచేలా మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ముంచుతారంటూ సీఎం తన స్థాయిని మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ఖండించారు.
తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గ కేంద్రాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాగా ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల సీఎం దిష్టిబొమ్మలను దహనం చేయనివ్వకుండా బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.