కడ్తాల్, జూన్ 28: ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు ప్రోటోకాల్ పాటించకుండా బీఆర్ఎస్ (BRS) ప్రజాప్రతినిధులపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. కడ్తాల్ మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆమనగల్లు మార్కెట్ యార్డు ఆవరణలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన దుకాణల సముదాయాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారని, ఈ కార్యక్రమానికి ఆమనగల్లు పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తాను ఆహ్వానించకుండా, శిలఫలాకంపై తమ పేరు ఉండకుండా… ఎమ్మెల్యేతోపాటు ఏఎంసీ చైర్పర్సన్ గీత, ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించి అవమానించిన్నట్లు ఆరోపించారు.
ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు ప్రొటోకాల్ పాటించడకుండా, కార్యక్రమానికి సంబంధంలేని వ్యక్తులతో దుకాణ సముదాయాన్ని ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమంలో సభా వేదికపై అధికార పార్టీకి చెందిన నాయకులు కూర్చోవడమేంటన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించవద్దని, అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్‌ను తప్పనిసారిగా పాటించాలన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటివి పునరావృత్తమైతే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిద్ధిగారి సురేశ్, కంబాలపల్లి శ్రీకాంత్, పోతుగళ్ల మహేశ్, ఒగ్గు మహేశ్, నింగారి కిషన్ పాల్గొన్నారు.