తుర్కయంజాల్,డిసెంబర్ 24 : తుర్కయంజాల్ సర్కిల్లో ఏర్పాటు చేసిన రెండు డివిజన్లలో ఒక డివిజన్‌కు కొహెడ పేరును పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రంగారెడ్డి అన్నారు. బుధవారం తుర్కయంజాల్ సర్కిల్ పరిధిలోని కొహెడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బిందు రంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయ్‌బాబు, గంగని శ్రీనివాస్, అంజనేయులు మాట్లాడుతూ.. తుర్కయంజాల్ సర్కిల్‌ను జనాభా ప్రాతిపదికన, విస్తీర్ణం ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా విభజించారని ఆరోపిఆంచారు.
విస్తీర్ణంలో ఎంతో పెద్దదైన కొహెడను డివిజన్‌గా ఏర్పాటు చేయకపోవడం సరికాదని అన్నారు. కొహెడ ప్రాంతం నుంచి వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు సుమారు 170 ఎకరాలు, చేపల మార్కెట్‌కు 13 ఎకరాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కోరకు 10 ఎకరాల స్థలాన్ని తీసుకున్న అధికారులు కొహెడను డివిజన్‌గా ఏర్పాటు చేయడం మాత్రం విస్మరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తుర్కయంజాల్ సర్కిల్లోని 53వ డివిజన్‌కు కొహెడ పేరును పెట్టాలని లేని పక్షంలో కొహెడను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
అంతేగాక తుర్కయంజాల్ సర్కిల్‌ను చార్మినార్ జోన్ నుంచి ఎల్బీనగర్ జోన్‌కు మార్చినట్లు అధికారులు చెపుతున్న ఇప్పటి వరకు ఎందుకు ఉత్తర్వులు జారీ చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజలకు మభ్యపెట్టడానికే ఎల్బీనగర్ జోన్లో కలిపినట్లు కాంగ్రెస్ నాయకులు నాడు సంబరాలు చేసుకున్నారని కాని ఇప్పటి వరకు ఉత్తర్వులు రాలేదని అన్నారు. కొహెడను డివిజన్‌గా ఏర్పాటు చేయాలని 800 అభ్యంతరాలు అందజేసిన అధికారులు అభ్యంతరాలను పరిశీలించలేదని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రమేష్,తిరుమలేష్,మానయ్య,శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గోన్నారు.