అదిగో.. ఇదిగో అంటూ ఆశజూపి వానకాలానికి సంబంధించిన రైతు భరోసాను ఎగ్గొట్టి రైతులను కుదేలు చేసిన రైతన్నకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. కష్టకాలంలో మేమున్నామంటూ..ఆదివారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల్లో రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించింది. షాద్‌నగర్‌లో నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని బొంగుళూరు వద్ద జరిగిన ధర్నాలో బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొని ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. షాబాద్ మండల కేంద్రంలోని ముంబయి-బెంగళూరు లింకు జాతీయ రహదారిపై షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుధర్నాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా, బొంరాస్‌పేట మండలంలోని తుంకిమెట్లలో జరిగిన ధర్నాలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, పరిగి బస్టాండ్ వద్ద జరిగిన రైతుధర్నాలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పాల్గొని సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
బీఆర్ఎస్ నాయకులు రైతన్నలతో కలిసి కదం తొక్కారు. నినాదాలతో ధర్నా ప్రాంగణాలు దద్దరిల్లాయి. ఇప్పటికైనా రైతు భరోసా ఇచ్చి తీరాల్సిందేనని, ప్రభుత్వం మెడలు వంచే వరకు పోరు ఆగదని నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆందోళన చేసిన బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అరెస్టు చేశారు. అన్ని చోట్లా ధర్నాలు, రాస్తారోకోలు సూపర్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది.
-రంగారెడ్డి, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ)
అబద్ధాలు చెప్పారు… అమలుకు సాధ్యంకాని హామీలిచ్చారు.. ప్రజలను మోసం చేశారు.. సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని అప్పటి ప్రభుత్వ పనితీరుపై అసత్య ప్రచారాలు చేయించారు.. చివరకు అధికారాన్ని చేజిక్కించుకున్నారు.. ప్రజలకిచ్చిన హామీలను మర్చిపోయారు.. రాష్ర్టాన్ని తిరోగమనంలోకి నెడుతున్నారు.. దశలవారీగా ఆరు గ్యారంటీలకు స్వస్తి పలికే కుట్రకు తెరలేపారు… సకాలంలో రైతులకు అండగా నిలువల్సిన సర్కారు రైతు భరోసాను ఇవ్వలేమని తేల్చిచెప్పారు.. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఉన్న ప్రేమ అని ధర్నాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఆ తర్వాత మొండిచేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాల్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రతి సీజన్‌కు ఠంచన్‌గా ఇచ్చిన రైతుబంధును రైతులు గుర్తు తెచ్చుకున్నారు. రైతులు పంటల సాగుకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు కేసీఆర్ ప్రభుత్వం వానకాలం, యా సంగి సీజన్న్లకు ముందుగానే రైతుబంధు సాయాన్ని అందిస్తూ వచ్చిందని రైతాంగం కొనియాడింది.
2018 వానకాలం సాగు నుంచి ఏటా రూ.8వేల సాయం అందించగా.. 2019 వానకాలం నుంచి ఆ సాయాన్ని కేసీఆర్ రూ.10వేలకు పెంచారు. కరోనా వంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ పెట్టుబడి సాయాన్ని ఆపలేదు. రైతన్నలకు ఆత్మబంధువుగా నిలిచిన రైతుబంధు పథకంలో రంగారెడ్డి జిల్లాలోని రైతాంగానికి 11 విడతలుగా గతేడాది వానకాలం వరకు రూ.3,337 కోట్లను నిరాటంకంగా అందించారు. కేసీఆర్ హయాంలో ప్రతి సీజన్‌కు ముందుగానే రైతు బంధు సాయం అందగా.. కాంగ్రెస్ హయాంలో వానకాలం ముగిసినా రైతుల ఖాతాల్లో నయా పైసా జమకాకపోవడంపై రైతాంగం ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతామని రైతులు హెచ్చరించారు.
రైతు భరోసా లేక గుండె చెదిరిన అన్నదాతకు బాసటగా నిలవాలని సంకల్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి మండలంలోనూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వగా.. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. ప్రభుత్వ, సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసి, ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కాగా నిరసన కార్యక్రమాల్లో యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులతో పాటు ఉమ్మడి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చి వానకాలం రైతు భరోసాను ఇచ్చేవరకూ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని , అప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కొట్లాడుడేనని స్పష్టం చేశారు. గ్రామ స్థాయిలోనూ ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తామని పేర్కొన్నారు.
షాద్‌నగర్, అక్టోబర్ 20 : రైతు భరోసాను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆదివారం షాద్‌నగర్‌లోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నాలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డితో కలిసి నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు.
షాబాద్, అక్టోబర్ 20 : కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆగమైందని, రైతాంగంతో పెట్టుకున్నవాళ్లు ఎవరు కూడా ఇప్పటివరకు నెగ్గలేదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువనాయకుడు పట్లోళ్ళ కార్తీక్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు రంగారెడ్డిజిల్లా షాబాద్‌లోని ముంబయి-బెంగళూరు లింకు జాతీయ రహదారిపై అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్తీక్‌రెడ్డి హాజరయ్యారు. సీఎం డౌన్‌డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు నర్సింగ్‌రావు, శ్రీరాంరెడ్డి, సహకార సంఘం చైర్మన్ శేఖర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా మాజీ కన్వీనర్ ప్రభాకర్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో గుక్కెడు నీటి కోసం అనేక తిప్పలు పడ్డ రోజులుండేవని, అలాంటి తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులంతా ఆగమయ్యారన్నారు. బంగారం లాంటి పంటలు పండించే రైతులంతా రేవంత్‌రెడ్డి పాలనలో రోడ్లపైకి వచ్చిన ధర్నాలు చేసే పరిస్థితి నెలకొన్నదన్నారు. దేశంలోనే ఏ ముఖ్యమంత్రీ ఆలోచన చేయని విధంగా రైతుల కోసం రైతు బంధును ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
గుంట భూమి ఉన్న రైతుకు కూడా ప్రమాదవశాత్తు చనిపోతే రూ.5లక్షల బీమా అందించినట్లు తెలిపారు. కానీ రేవంత్‌రెడ్డి పాలనలో రుణమాఫీ ఖతం పెట్టిండు, రైతు బంధు బంద్ పెట్టిండు, ఆఖరుకు రైతు చనిపోతే ఇవ్వాల్సిన రూ.5లక్షలు కూడా ఇవ్వడంలేదు. రైతులకు రైతు బంధు డబ్బులు ఇవ్వడంలేదు కానీ, ఈ పహిల్వాన్ వెళ్లి మూసీపై రూ.లక్షన్నర కోట్లు పెట్టి నిర్మాణం చేస్తానని చెబుతున్నారన్నారు. గ్రామాల్లో పరిస్థితి అధ్వానంగా మారడంతో పాటు రైతులను నాశనం చేసి మా రంగారెడ్డిజిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బొందపెట్టి, రైతుబంధు లాంటి పథకాన్ని కూడా బొందపెట్టి, మూసీ, హైడ్రా వెంట ఉరుకులాడుతున్నారని, ప్రజలు ఇదంతా యాది పెట్టుకుంటారని చెప్పారు. బరాబార్ మళ్లీ కేసీఆర్ వస్తడు.. వచ్చిన వెంటనే రైతులను కండ్లల్లో పెట్టుకుని చూసుకుంటారని తెలిపారు.
షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరంతర పోరాటం చేస్తామన్నారు. రుణమాఫీ కూడా కొంతమందికే అయ్యిందని, మిగతావారందరికీ చేసే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. పది నెలల్లో కాంగ్రెస్ పరిపాలన రైతు బంధుకు మూతపెట్టిందని, రుణమాఫీ పేరుపై మోసం చేసిందని, పంట కొనుగోలు చేస్తానని చెప్పి ఒక్క కిలో ధాన్యం కొనుగోలు చేయని ఘనత రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రజల పక్షాన, రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుంటే పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కడిక్కడ అరెస్టులు చేస్తున్నారన్నారు. రైతుబంధు డబ్బులు వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినా ప్రజా సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని, ప్రజల సమస్యలను గుర్తించడంలేదన్నారు. ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, అసత్యాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి హామీలను నెరవేర్చాలనే ధ్యాసే లేదన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ పాలనలో రైతు రాజులా బతికితే నేడు రేవంత్ పాలనలో రైతులు అప్పులపాలవుతున్నారని, కనీస సంక్షేమంపై ఈ ప్రభుత్వానికి శ్రద్ధలేదన్నారు. రైతు రుణమాఫీని అసంపూర్తిగా చేయడమే కాకుండా రైతు భరోసాను ఎత్తేసేందుకు ప్రయత్నించడం బాధాకరమన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్‌ను కూడా ఓ విడుత ఎగ్గొట్టారని, ఇప్పటికీ పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదని విమర్శించారు. రైతుల ఖాతాల్లోకి భరోసా నిధులు పడే వరకు బీఆర్ఎస్ పార్టీ నిరసనలు కొనసాగుతాయని, రైతులకు అండగా ఉంటామని హెచ్చరించారు.
వాట్సప్ గ్రూపుల్లో, యూ ట్యూబ్ చానెళ్లలో సొంత డబ్బా కొట్టుకునుడు తప్పా ప్రజలకు ఒరగబేట్టిందేమీ లేదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డారు. నాడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తే నేడు సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో రాష్ట్రం తిరోగమన దిశగా పయనిస్తున్నదన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దాకా వెంటాడుతూ, వేటాడుతునే ఉంటామని, ప్రభుత్వ పనితీరును చీల్చిచెండాడుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న మోసాలను రైతులు, ప్రజలు గ్రహించాలని సూచించారు. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు.
ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడినట్లు ఎక్కడా లేదని, రైతులను గోసపెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెపుతారని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. దేవుళ్లపై ఒట్టు వేసి ఓట్లను దండుకున్న సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు ఇచ్చిన రైతు రుణమాఫీ పథకాన్ని మర్చిపోయారని, పెట్టుబడి సహాయంగా రైతు భరోసాను అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ఆ పథకానికి స్వస్తి పలికేందుకు కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. అప్పటి సీఎం కేసీఆర్ రైతుల బాగు కోసం మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, 24 గంటల విద్యుత్, రాయితీ ద్వారా వ్యవసాయ పనిముట్ల వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి రైతుకు అండగా నిలిస్తే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అప్పులపాలు చేస్తున్నదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రైతు భరోసాకు స్వస్తి పలుకుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు మరోమారు మోసపోయారని, ఉమ్మడి రాష్ట్ర పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.
ఇబ్రహీంపట్నం : పంటల సాగుకోసం రైతుభరోసాను మూడుపంటలకు అందజేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతు భరోసాకు ఎగనామం పెట్టడం సిగ్గుచేటని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. వానకాలానికి రైతు భరోసాను అందించలేమని మంత్రి తుమ్మల శనివారం ప్రకటించటంపై ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బొంగుళూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ రైతులకు సాయం అందించకపోవటం సరైంది కాదన్నారు. రైతులకు రైతుభరోసాను వెంటనే అందించాలన్నారు. లేకపోతే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కొడంగల్ : రైతు భరోసాపై కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు నియోజకవర్గంలోని బొంరాస్‌పేట, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లో పెద్దఎత్తున నిరసన కార్యక్రమన్ని నిర్వహించారు. బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల రోడ్డుపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తుంకిమెట్లలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 15వేలు ఇస్తుందని నమ్మి గెలిపించుకొని మోసపోయామన్నారు. ఖరీఫ్‌లో కూడా రైతు భరోసా ఇవ్వడం కుదరదని కాంగ్రెస్ మంత్రులు ఖరాఖండిగా చెప్పడం సిగ్గుచేటుగా ఉందన్నారు. రైతు భరోసాను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుందనే ఆశతో రైతులు వడ్డీలకు అప్పులు తెచ్చుకొని పంట సాగు చేపట్టారు. ప్రభుత్వం నమ్మించి మోసం చేస్తుందనేది రుజువైందని, దీపావళి నాటికి రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసాను అమలు చేయాలని నరేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతంలో కలెక్టరేట్ ఉండాలని భావించి.. మాజీ సీఎం కేసీఆర్ వద్ద పట్టుబట్టి కొంగరకలాన్ సమీపం లో కలెక్టరేట్‌ను సకల హంగులతో ఏర్పాటు చేయించాం. దానిని ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడి నుంచి తరలిస్తామని చెప్పడం సిగ్గు చేటు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా గెలి చిన మల్రెడ్డి రంగారెడ్డి పదినెలల కాలంలో సెగ్మెంట్ అభివృద్ధికి రూపాయీ కేటా యించలేదు. ఆయన మంత్రి పదవికోసం పాకులాడుతున్నారు. మంత్రుల వద్దకు వెళ్లి నిధులు అడిగే మొహం లేక నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే ప్రారంభోత్సవాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ర్టానికి దరిద్య్రం పట్టింది. వ్యవసాయ రంగం కుదేలైంది. రియల్ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. సీఎం పొద్దున ఒక ప్రకటన చేస్తే…ఆయన కేబినెట్లో ఉన్న మరో నలుగురు మంత్రులు ఇంకో ప్రకటన చేస్తారు. గత కేసీఆర్ పాలనలో దేశంలోనే అగ్రస్థానానికి ఎదిగిన తెలంగాణ రాష్ట్రం.. నేడు ఆర్థిక లోటుతో ఇబ్బందులకు గురవుతున్నది. కాంగ్రెస్‌కు రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం.
– మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు
రాష్ర్టాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారు. కానీ, నేడు ఓ తెలివిలేని దద్దమ్మ చేతిలో రాష్ట్రం నలిగిపోతున్నది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచి హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చుతున్నాడు. వారికి నరకం చూపుతున్నాడు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎన్నికల్లో గెలిచేందుకు పెట్టిన డబ్బులను వసూలు చేసుకునేందుకు ఓ కొత్త బిచ్చగాడు వచ్చాడు.. అతడి చేతిలో ఇబ్రహీంపట్నం మరో ఐదేండ్లు వెనక్కి పోయింది. ఈ పది నెలల కాలంలో సెగ్మెంట్ అభ్యున్నతికి రూపాయీ కేటాయించలేదు. స్వార్థ ప్రయోజనాల కే ప్రాధాన్యమిస్తున్నారు. అతడి అరాచకాలు భరించలేక ఐదారుగురు సీఐలు, తహసీల్దార్లు, ఏసీపీలు బదిలీలు పెట్టుకుని మరీ వెళ్లిపోయారు.
– క్యామ మల్లేశ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు
స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పార్టీలు మారినా.. కార్యకర్తలంతా పార్టీ వెన్నంటే ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామా ల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయం. ఇప్పటికే గ్రామాలు, పట్టణాల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత ప్రారంభమైంది. ఎవరెన్నీ కుట్రలు చేసినా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలను స్వాధీనం చేసుకుంటాం. పార్టీ కోసం పని చేసే బీఆర్ ఎస్ శ్రేణులకు రానున్న రోజుల్లో తగిన గుర్తింపు తప్పకుండా లభిస్తుంది.
– మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు