కేశంపేట, జూన్ 17 : కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయాల్లో హుందాతనాన్ని పాటించాలని బీఆర్ఎస్ చింతకుంటపల్లి గ్రామ నాయకుడు రమేశ్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవలకాలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలన్న ఉద్దేశంతోనే ఆ భూమికి ఫెన్సింగ్ వేశాడని, ఈ విషయమై గ్రామస్తులతో చర్చించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశానన్నారు. అది జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు మండలంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారని, గ్రామ అభివృద్ధికోసం అహర్నిశలు కృషి చేసిన తనను వ్యక్తిగతంగా విమర్శించడం బాధ కలిగించిందన్నారు.
చింతకుంటపల్లిని ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కృషితో దాదాపు రూ.కోటి వరకు అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు తీసుకొచ్చానన్నారు. గ్రామ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదన్నారు. అధికారంలో ఉన్నవారు నోటికొచ్చినట్లు మాట్లాడకుండా మర్యాదగా మాట్లాడి రాజకీయాల్లో విలువలను పెంచి తనలాంటి యువతను ప్రోత్సహించాలని కోరారు. సమావేశంలో సత్యనారాయణ, కృష్ణయ్య, వెంకటయ్య, మల్లేశ్, శ్రీనివాస్, శ్రీశైలం, మహేందర్, కాశీం, శ్రీకాంత్, రమేశ్, మదు. ఎ శ్రీశైలం, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.