రంగారెడ్డి, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): టికెట్ వచ్చేదెవరికో.. రానిదెవరికో తెలియని పరిస్థితి కాంగ్రెస్‌ది.. బరిలో నిలిపేందుకు అభ్యర్థులే లేని దైన్య స్థితి బీజేపీది.. ఈ తరుణంలో ఆ పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారై సమరానికి సై అంటుండగా.. ప్రతిపక్షాలు అభ్యర్థుల ప్రకటనలో డీలా పడ్డాయి. మరోవైపు గ్రూపు తగాదాలు, కుమ్ములాటలు, వర్గపోరుతో బీజేపీ, కాంగ్రెస్‌లు అట్టుడుకుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలో ‘సీటుకు నోటు’ వ్యవహారం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఇప్పటికే సీట్లు కేటాయించడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు క్షేత్ర స్థాయి పర్యటనలతో నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. ప్రచార రథాలను సైతం సిద్ధం చేసుకొని పోరుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో ఆ పార్టీల నేతలు, కార్యకర్తలు అసహనానికి గురై అధికారపార్టీలో చేరుతున్నారు. దీంతో బీఆర్ఎస్ మరింత బలోపేతంగా మారుతండగా.. పార్టీ క్యాడర్ సైతం మంచి జోష్ మీదున్నది.
ఎవరికి టికె ట్ వస్తుందో..ఎవరికి రాదో తెలియని అయోమయ స్థితి కాంగ్రెస్‌ది. నిలబెట్టేందుకు అభ్యర్థులే లేని దైన్యస్థితి బీజేపీది. వెరసి.. జిల్లాలోని కాంగ్రెస్, బీజేపీల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ప్రజల్లో కి ఎలా వెళ్లాలో తెలియక రెం డు పార్టీల నేతలు సతమతమవుతున్నారు. మరోవైపు గ్రూపు లు, కుమ్ములాటలు, వర్గపోరు తో ఈ పార్టీలకు చెందిన క్యాడర్‌లోనూ అయోమయం నెలకొన్నది. మహేశ్వరం నియోజకవర్గంలో ‘సీటుకు నోటు’ వ్యవహారం కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తున్న ది. బీఆర్ఎస్లో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయి పర్యటనలతో ఎమ్మెల్యే అభ్యర్థులు నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా ల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇతర పార్టీల నుంచి వలసలు సైతం భారీగా ఉండటంతో క్యా డర్ కూడా మంచి జోష్ మీదున్నది.
అన్ని పార్టీల కంటే ముందుగానే టికెట్లు ఖరారు చేసి విపక్షాలకు సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. అభివృద్ధి కార్యక్రమాలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు దూసుకుపోతుండగా ప్రతి పక్షాలు మాత్రం ఎన్నికలకు ముందే ఢీలా పడిపోయాయి. కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్లు ఖరారు కాకపోవడంతో ఆ పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్, ఢిల్లీలో మకాం వేసి పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. తమ నేతకు టికెట్ వస్తుందంటే ..లేదు లేదు తమ నేతకే వస్తుందని ఆయా నియోజకవర్గాల్లో చోటామోటా నేతలు కుస్తీలు పడుతున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా రెండు పార్టీల్లోనూ పరిస్థితి నెలకొనడం క్యాడర్‌ను కలవర పెడుతున్నది. ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే చర్యలను కాంగ్రెస్, బీజేపీ అధిష్టానాలు నేటికీ చేపట్టకపోవడంపై అటు నేతలు, ఇటు కార్యకర్తల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్‌లో వర్గ పోరు..
జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండడం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. మహేశ్వరం నియోజకవర్గం నుంచి ఎనిమిది మంది, ఇబ్రహీంపట్నం నుంచి తొమ్మిది మంది, చేవెళ్ల నుంచి 14మంది, షాద్‌నగర్ నుంచి 11 మంది ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేశారు. టికెట్ కోసం ఎవరికి వారుగా నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీలోని గ్రూపు తగాదాలు రోజురోజుకూ పెరుగుతుండడం పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తున్నది. మహేశ్వరం కాంగ్రెస్‌లో ‘సీటుకు నోటు’ వ్యవహారాన్ని ఆ పార్టీకి చెందిన నేతలే బయట పె ట్టారు. ఈ అంశం నేతల మధ్య అంతర్గత విభేదాలను మరోసారి బట్టబయలు చేసింది. చేవెళ్ల నియోజకవర్గంలో లోకల్, నాన్‌లోకల్ లొల్లి నడుస్తున్నది. ముగ్గురు స్థానిక అభ్యర్థులు టికె ట్ కోసం ప్రయత్నిస్తుండగా స్థానికేతరులకు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతున్నది. ముగ్గురిలో ఎవరికీ టికెట్ వచ్చినా పనిచేస్తామని వేరే వారికి ఇస్తే వ్యతిరేకిస్తామని స్థానిక నేతలు బాహాటంగానే పేర్కొంటున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో పార్టీని వెన్నంటి ఉన్న ఓ బీసీ నేత టికెట్ కోసం ప్రయత్నం చేస్తుండగా మరో సామాజికవర్గం వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నేత కాంగ్రెస్ నుంచి లేకుంటే..బీజేపీ నుంచి అయినా టికెట్ తనకు కచ్చితంగా వస్తుందని చెప్తుండడం క్యాడర్‌ను అయోమయానికి గురి చేస్తున్నది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనూ ఆశావహులు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలపై ఆశలు పెట్టుకుని ఎవరికీ వారుగా వర్గాలుగా విడిపోయి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రజల్లోనే ఎమ్మెల్యేలు
సిట్టింగ్‌లకే టికెట్లను ఖరారు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. టికెట్లు ఖరారు అయినప్పటి నుంచే మం త్రి సబితాఇంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, కాలె యాదయ్యలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. లక్షలోపు పంట రుణాల మాఫీ, బీసీ కులవృత్తులతోపాటు మైనార్టీలకు రూ.లక్ష సాయం, గృహలక్ష్మి అర్హుల ఎంపిక, దివ్యాంగుల పింఛన్ పెంపు, రెండో విడుత గొర్రెల పంపిణీ, దళితబంధు వంటి అనేక ప్రభుత్వ పథకాలతో క్షేత్రస్థాయిలో అలుపెరగకుండా పర్యటిస్తుండడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు ఠారెత్తిపోతున్నారు. క్లీన్‌స్వీప్ చేయడమే లక్ష్యంగా మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వంటి నేతలు విస్తృతంగా జిల్లా పర్యటనలు చేస్తున్నా రు. వివిధ పార్టీల నుంచి రోజుకో చోట భారీగా బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతుండడంతో పార్టీ క్యాడర్ జోష్ మీదున్నది.
బీజేపీకి అభ్యర్థులు కరువు..
రంగారెడ్డి జిల్లా బీజేపీలో విచిత్ర పరిస్థితి నెలకొన్నది. చాలా చోట్ల క్యాడర్ లేక సతమతమవుతున్న ఆ పార్టీ అభ్యర్థులను కూడా వెతుక్కునే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ గెలిచే పరిస్థితి లేదని తేలిపోవడంతో పోటీ చేసేందుకు సైతం చాలామంది ఆసక్తి చూపడంలేదని సమాచారం. చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో నాన్ లోకల్ అభ్యర్థులు, వేరే ప్రాంతం నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డ వారిని ఎన్నికల బరిలో నిలపాలని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటివరకు జెండాను మోసిన స్థానిక నేతలు అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇక వామపక్షాల పార్టీల పరిస్థితి సైతం అయోమయంగా ఉన్నది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సీపీఎం బలహీనపడింది. పొత్తుల కోసం వెంపర్లాడుతున్న ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. పొత్తు కుదరని పక్షంలో అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలనే విషయంలో ఆ పార్టీ నేతలు తర్జనభర్జన పడుతున్నారు.