Vikarabad | పరిగి, జూన్ 10 : అక్కను బాగా చూసుకోవడం లేదనే కారణంతో బావపై దాడికి పాల్పడగా అడ్డుగా వచ్చిన అతడి తల్లిని కొట్టడంతో మహిళ చనిపోగా, ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి పరిగి మండలం రాపోలు గ్రామంలో చోటు చేసుకుంది.
రాపోల్ గ్రామానికి చెందిన గండు నర్సమ్మ, ఆమె కొడుకు గండు రాజేందర్ పై అదే గ్రామానికి చెందిన రాంచరణ్, కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. కొడుకు రాజేందర్ ను కొట్ట వద్దంటూ తల్లి నర్సమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా యువకులు నర్సమ్మ పై దాడి చేశారు. దీంతో నర్సమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కొడుకు రాజేందర్‌కు తీవ్ర గాయాలు కావ డంతో పరిగి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాపోల్ గ్రామానికి చెందిన సంగీత, అదే గ్రామానికి చెందిన రాజేం దర్‌కు సుమారు పదేళ్ల క్రితం వివాహమైంది. గత మూడు సంవత్సరాలుగా భార్యాభర్తలు విడివిడిగా ఉంటున్నారు. దీంతో సంగీత చిన్నాన్న కుమారుడు రాంచరణ్ తన అక్కను బాగా చూసుకోవడం లేదనే కోపంతోనే ఈ దాడికి పాల్పడినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న పరిగి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిలో అనుమానితులుగా ఉన్న వారిని పోలీసులు అదుపులోకి విచారిస్తున్నట్లు సమాచారం.