రంగారెడ్డి, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ చార్జీల పెంపును నిరసిస్తూ బీఆర్ఎస్.. చలో బస్‌భవన్ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో గురువారం పోలీసులు జిల్లాలోని ఆ పార్టీ నేతలను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. అదేవిధంగా ముఖ్యనేతలను తెల్లవారుజామునే హౌస్ అరెస్టు చేశారు. జిల్లా నలుమూలల నుంచి బస్‌భవన్ ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణు లు పెద్ద ఎత్తున బయలుదేరారు.
కాగా, హౌస్ అరెస్టు నుంచి బయట కొచ్చి బస్ భవన్ ముట్టడికి బయలుదేరిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దండెం రాంరెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు సత్తువెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ నాయకులను అరెస్టు చేశారు.
ఉదయమే మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, వెంకటరమణారెడ్డి, ప్రశాంత్‌కుమార్‌రెడ్డి తదితరులు బస్‌భవన్ ముట్టడికి బయలుదేరారు. కాగా, వారిని మార్గమధ్యంలోనే అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. పోలీసు లను లెక్కచేయకుండా బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్‌లోని బస్ భవన్ ముట్టడికి అధికంగా తరలివెళ్లారు.
వెంటనే తగ్గించాలి..
పెంచిన బస్‌చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలి. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తుండడంతో ప్రభుత్వం ఆర్టీసీకి పడిన బకాయిలను ..పురుషులపై చార్జీలను పెంచి రుద్దాలనుకోవడం దారుణం. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీకి బకాయిలు చెల్లించి.. చార్జీలను తగ్గించాలి.-సబితాఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే
అక్రమ అరెస్టులు తగవు
ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ నేతలను అక్రమంగా ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనం. ప్రభు త్వం ఆర్టీసీకి పడిన బకాయిలను ప్రజలపై చార్జీల రూపం లో రుద్దాలనుకోవడం సమంజసం కాదు. వెంటనే పెంచిన చార్జీలను తగ్గించాలి.
-మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు