పరిగి, మే 15 : గత సంవత్సరం కొనుగోలు చేసిన సన్న వడ్లకు బోనస్‌గా రూ.1200 కోట్లు ఇచ్చామని, ఇంకా ఇవ్వాల్సి ఉందని, తప్పనిసరిగా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పంటలు పండాయని, ప్రభుత్వం సరైన ధరకు కొనుగోలు చేయడంతోపాటు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
గురువారం పరిగి మండలం సుల్తాన్పూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్.చౌహాన్, కలెక్టర్ ప్రతీక్జైన్లతో కలిసి సీఎస్ రామకృష్ణారావు సందర్శించారు. ఈ సందర్భంగా వడ్లలో తేమ శాతం, వడ్ల కొనుగోలు వివరాలను సీఎస్ పరిశీలించారు. అనంతరం సీఎస్ మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ వచ్చి ప్రతిసారి రూ.500 కోట్లు, రూ.1000 కోట్లు కావాలని కోరుతుంటారని, డబ్బులు ఎక్కడికి పోతున్నాయని అడుగగా, మీరు క్షేత్రస్థాయికి రండి చూయిస్తానని చెప్పారన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద తాడిపత్రిలు, గోనె సంచులు, మంచినీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం ద్వారా ఎన్ని బస్తాలు వడ్లు కొనుగోలు చేశారని సీఎస్ అడుగగా 6850 బస్తాలు కొనుగోలు చేశామని డీసీఎంఎస్ ఇన్చార్జి వెంకటయ్య తెలిపారు. ఎన్ని రోజుల్లో ధాన్యం రావడం పూర్తవుతుందో తెలుసుకున్నారు.
46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
పరిగి మండలం సుల్తాన్పూర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్.చౌహాన్ మీడియాతో మాట్లాడుతూ.. 2022-23 సంవత్సరంలో ఈ సమయానికి 20 లక్షల మెట్రిక్ టన్నులు, గత సంవత్సరం ఈ సమయానికి 30 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందన్నారు. గత సంవత్సరం కంటే 150 శాతం ఎక్కువ ధాన్యం కొనుగోలు పెరిగిందన్నారు. పెద్ద మొత్తంలో ధాన్యం వస్తుండడంతో అదనంగా టార్పాలిన్లు ఇవ్వడం జరిగిందని, రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చిన తర్వాత బాధ్యత అంతా తమదని, రైతులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
అవసరమైతే ఆటోమేటిక్ ప్యాడీ డ్రయర్ సైతం కొనుగోలు చేయడం జరుగుతుందని, రైతులు నిర్భయంగా కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలని చెప్పారు. వడ్లు కోతల సమయంలో వర్షాలపై ఎప్పటికపుడు రైతులకు సమాచారం అందిస్తున్నామని, వాటిని కాపాడేందుకు ఏదైనా ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మూడు రోజుల్లో డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వికారాబాద్ జిల్లాలో దొడ్డు వడ్లు ఎక్కువగా పండుతాయని, కుప్పల దగ్గరకు వెళ్లి తేమ శాతం పరిశీలించడంతోపాటు కొనుగోలు అనంతరం ధాన్యం తరలింపు, రైతులకు డబ్బులు పడ్డాయా అని తెలుసుకోవడం జరిగిందన్నారు. సన్న వడ్ల పరిమాణం తెలుసుకునేందుకు డిజిటల్ క్యాలిబర్ తెప్పించాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్.చౌహాన్లను రైతులు, రైస్‌మిల్లర్లు సన్మానించారు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, డీసీఎస్వో మోహన్‌బాబు, జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, తహసీల్దార్ ఆనంద్‌రావు, డీసీఎంఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా బిజినెస్ మేనేజర్ వెంకటరమణారెడ్డి, ఏపీఎం శ్యాంసుందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
కొడంగల్‌లో చీఫ్ సెక్రటరీ పర్యటన
కొడంగల్ : జిల్లా పర్యటనలో భాగంగా గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌తో కలిసి కొడంగల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొడంగల్ ప్రాంతంలో వైద్య కళాశాల కోసం ఏర్పాట్లు చేస్తున్నందున ప్రస్తుతం కొనసాగుతున్న 50 పడకల ఆసుపత్రిని 220 పడకలుగా అసుపత్రి సామర్థ్యాన్ని పెంచుతున్న సందర్భంగా జరుగుతున్న పనులను పరిశీలించారు.
పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ విభాగ అధికారులకు సూచించారు. రోగుల వివరాలతోపాటు ప్రసవాల సంఖ్యపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ ఆసుపత్రి విద్యార్థినులు, సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలకు అల్పాహారం అందిస్తున్న హరే కృష్ణ సంస్థ కిచెన్ షెడ్‌ను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్పీ నారాయణరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, డీసీహెచ్ఎస్ ఆనంద్, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ పద్మ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ లిల్లీ మేరీ, ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రప్రియ, మున్సిపల్ కమిషనర్ బలరామ్‌నాయక్, తహసీల్దార్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
సక్రమంగా పనిచేయాలి
వికారాబాద్ : ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యేలా అధికారులు పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో వివిధ శాఖల పనితీరు, చేపట్టాల్సిన వివిధ అంశాలపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్.చౌహాన్, కలెక్టర్ ప్రతీక్జైన్లతో కలిసి సమీక్షించారు. ఒక్క శాతం ఉన్న ఉద్యోగులుగా మనం 99 శాతం ఉన్న ప్రజలకు సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన అధికారులకు సూచించారు.