షాద్‌నగర్‌టౌన్, జూలై 17 : బొట్టునే పెట్టినాము.. బోనమే ఎత్తినాము.. చల్లంగా చూడు పోచమ్మతల్లి అంటూ మహిళలు బోనాలతో అమ్మవారిని దర్శించుకోవడంతో షాద్‌నగర్ పట్టణం పోచమ్మతల్లి బోనాలతో పులకించిపోయింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా బోనాల సంబురాలు అంబరాన్ని అంటాయి. జోగినిల, పోతురాజు విన్యాసాలతో కుర్రకారు చిందులేశారు. భాజాభజంత్రీలతో బోనాలు ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా గురువారం షాద్‌నగర్ పట్టణంలో పోచమ్మతల్లి బోనాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు పట్టణవాసులు. భక్తుల సందడితో పోచమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మహిళలు , యువతులు బోనాలతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.
పటేల్రోడ్డు, సంజీవ, నెహ్రూనగర్, వెంకటేశ్వర, భాగ్యనగర్, పద్మావతి, రతన్కాలనీ, తిరుమల, శ్రీనగర్‌కాలనీలో పోతురాజుల విన్యాసాలు, ఆటాపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారికి సమర్పించే తొట్టెలతో బోనాల ఉత్సావం అంగరంగవైభవంగా సాగింది. బోనాల ఉత్సవాలలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని సంజీవ, నెహ్రూకాలనీలో నిర్వహించిన బోనాల ఉత్సవాలలో బీఆర్ఎస్ యువ నాయకుడు వై. రవీందర్‌యాదవ్ మున్సిపల్ మాజీ చైర్మన్ కొందూటి నరేందర్, మాజీ కౌన్సిలర్లతో కలిసి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అదే భక్తులు తొట్టెలలను ఊరేగింపు నిర్వహించారు. అదే విధంగా ఉత్సవాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా షాద్‌నగర్ పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. భక్తిభావాన్ని అలవర్చుకోవాలని, బోనాల ఉత్సవాలతో షాద్‌నగర్‌లో ఆధ్యాత్మిక వాతవరణం నెలకొందన్నారు. ఈ బోనాల ఉత్సవాలలో మాజీ కౌన్సిలర్లు వెంకట్రాంరెడ్డి, శ్రీనివాస్, యుగేందర్, చెన్నయ్య, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు కిషోర్, నాయకులు ఏజాజ్, భాస్కర్, మురళీ, బాలాజీ, యూత్ సభ్యులు పాల్గొన్నారు.