సిటీబ్యూరో, జూలై 19 (నమస్తే తెలంగాణ) : మెట్రో విస్తరణలో ప్రయాణికుల రద్దీ అత్యంత కీలకంగా మారింది. నగరంలో రెండో దశ మెట్రో విస్తరణ కోసం ప్రణాళికలు కేంద్రానికి చేరాయి. కానీ కేంద్ర అనుమతుల విషయంలోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రద్దీ లేని ప్రాంతాలకు మెట్రో అనుమతులు అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ మెట్రో విస్తరణపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
మెట్రో ఫేజ్-2 విస్తరణలో భాగంగా పార్ట్- ఏను 76.4 కి.మీ., పార్ట్-బీలో 86.1 కి.మీ. మేర నిర్మాణానికి రూ.45వేల కోట్ల అంచనా వ్యయంతో చేసిన ప్రతిపాదనలకు ఇప్పటికీ కేంద్రం ఆమోదించలేదు. మెట్రో అనుమతుల ప్రక్రియలు ట్రాఫిక్ స్టడీ అత్యంత కీలకమని చెబుతుండగా.. రెండో దశలో చేర్చిన ఫ్యూచర్ సిటీ, జేబీఎస్-శామీర్పేట మెట్రో మార్గాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
నగరంలో మెట్రో రైలు రెండో దశ విస్తరణలో భాగంగా రెండు భాగాలుగా చేపట్టేందుకు డీపీఆర్ సిద్ధమైంది. ఇందులో పార్ట్-ఏలో ప్రస్తుతమున్న మెట్రో మార్గాలను విస్తరిస్తూ 76.4కి.మీ. మేర నిర్మాణానికి ప్లానింగ్ చేశారు. దీంతోపాటు పార్ట్-బీలో ఎయిర్పోర్టు నుంచి భారత్ ప్యూచర్ సిటీ, జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్పేట్ ప్రాంతాలతో మరో 86.1కి.మీ. మేర మెట్రో నిర్మాణానికి సన్నాహాలు చేశారు. దీనికి అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీపై సమగ్ర అధ్యయనం చేయగా.. ఇందులో జేబీఎస్ నుంచి శామీర్పేట, ఫ్యూచర్ సిటీ మెట్రో మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఆశించిన స్థాయిలో లేదని వెల్లడైనట్లు సమాచారం.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రో నిర్మాణానికి కేంద్రం అనుమతులు జారీ చేస్తున్నది. ఈ క్రమంలో ఏ మాత్రం జనసంచారం లేని ప్రాంతాలకు మెట్రో నిర్మించాలనే ప్రణాళికలను కేంద్రం ఎలా ఆమోదం తెలుపుతుందనేది ఇప్పుడు ప్రజా రవాణా నిపుణులు విస్మయానికి గురి చేస్తున్నది. నిజానికి ఈ రెండు మార్గాల్లో జరిగిన సర్వేలోనే రద్దీ అత్యంత దారుణంగా ఉందని తేలింది. కానీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టులను చేపడుతున్నట్లు డీపీఆర్ రూపొందించడం, వాటిని కేంద్రానికి అందించడం ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే ఈ రెండు మార్గాల్లో సగటున రోజువారీ ప్రయాణికుల సంఖ్య 15వేల లోపే ఉందని వెల్లడైంది. జనసంచారమే లేని ప్రాంతానికి మెట్రో పేరిట నిధులను ఖర్చు చేయడమెందుకనేది ప్రశ్నగా మారింది.
30 లక్షలకు జనాభా కలిగిన మేడ్చల్ ప్రాంతానికి మెట్రో నిర్మించాలనే ప్రతిపాదనలు గడిచిన ఐదేండ్ల కిందటే ఉన్నాయి. ఈ ప్రాంతానికి మెట్రో విస్తరించడం ద్వారా నిత్యం 3 లక్షలకు పైగా రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయనే అంచనాలే ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పార్ట్-ఏలో చేర్చకుండా అవసరంలేని ప్రాంతాలతో కలిపి డీపీఆర్ రూపొందించడం కూడా ఈ ప్రాంతానికి కీలకమైన ప్రాజెక్టుపై ప్రభావం పడే అవకాశముంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కీలకమైన మేడ్చల్ మెట్రో నిర్మాణానికి ప్రత్యేక చొరవ తీసుకుంటే తప్పా… రెండో దశ మెట్రో పనులకు మోక్షం దొరికేలా లేదు.