వికారాబాద్, జూలై 16, (నమస్తే తెలంగాణ): జిల్లా బీజేపీలో గ్రూపు రాజకీయం రచ్చకెక్కింది. జిల్లా అధ్యక్షుడి నియామకంతో మొదలైన గ్రూపు రాజకీయం మరింత రాజుకుంది. జిల్లాలో అంతంతమాత్రంగానే ఉన్న బీజేపీ క్యాడర్ నాలుగైదు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు రాజకీయం చేస్తుండడం గమనార్హం. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లోని బీజేపీ నేతలు తలోదారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే బీజేపీ జిల్లా అధ్యక్షుడి నియామకం సమయంలోనే ప్రస్తుతం అధ్యక్షుడిగా ఆ పార్టీ అధిష్ఠానం నియమించిన అధ్యక్షుడిని కాకుండా మిగతా ఆశావహుల్లో ఎవరిని నియమించినా సరేననే ప్రతిపాదన ఆ పార్టీ అధిష్ఠానం ముందుంచారు.
అంతేకాకుండా గద్వాల జిల్లాకు చెందిన వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా ఎట్టిపరిస్థితుల్లోనూ నియమించొద్దని అధిష్ఠానం నేతలకు జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి ఆశించిన వారంతా తెగేసి చెప్పారు. అయినప్పటికీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టుబట్టి స్థానికేతరుడైన రాజశేఖర్‌కే జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెట్టేలా పావులు కదిపి సక్సెస్ అయ్యారు. అయితే రాజశేఖర్ జిల్లా అధ్యక్షుడిగా నియామకం అయిన నాటి నుంచి గ్రూపు రాజకీయాలు ఇంకా తారాస్థాయికి చేరాయనే ప్రచారం ఆ పార్టీలోనే జరుగుతున్నది. వింతేమిటంటే జిల్లా అధ్యక్షుడిగా రాజశేఖర్ నియామకంలో కీలకంగా వ్యవహరించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిని కూడా దూరం పెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
జిల్లా బీజేపీ నేతలు తలోదారి అన్నట్టుగా గ్రూపు రాజకీయాలు చేస్తుండడం గమనార్హం. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో ఎవరికి వారు అన్నట్టుగా ఆయా నియోజకవర్గాల నేతల తీరు ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని స్థానికేతరుడికే ఆ పార్టీ అధిష్ఠానం అప్పగించగా, నియోజకవర్గ స్థాయిలోనూ స్థానికేతరుల పెత్తనం నడుస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన తీరు చేస్తే ఇదే నిజమేననిపిస్తుంది. పది రోజుల క్రితం జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని జిల్లా కార్యవర్గం ఆహ్వానించింది.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సమయమిచ్చిన కొండా, తన వర్గం నేత మాట మేరకు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి రాకుండా దోమ వెళ్లేందుకు బయలుదేరారు. ఈ విషయం తెలిసిన బీజేపీ నేతలు, కార్యకర్తలు మన్నెగూడ వరకు వెళ్లి ఎంపీ కారును అడ్డగించి, మేం అందరం
ఎదురుచూస్తుంటే ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ… శ్రీధర్ రెడ్డి చెబితేనే వస్తానని అనడం, కార్యకర్తలు మీకు అవసరం లేదా అంటే.. నాకు కార్యకర్తలు అవసరం లేదని వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది.
అయితే కొందరు బీజేపీ నేతలు కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని ఎంపీకి ఫిర్యాదు చేయడంతోనే వ్యాఖ్యలు చేశారనే ప్రచారం కూడా జరుగుతున్నది. అంతేకాకుండా చివరకు కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ కొండా అందరి ముందే కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించలేదని జిల్లా అధ్యక్షుడిని ప్రశ్నించడంతో పాటు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మరోవైపు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో జరిగిన ఓ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యల వల్ల కూడా పార్టీలో చీలికలు తారాస్థాయికి చేరుకున్నాయనే ప్రచారం జరుగు తున్నది.
వికారాబాద్ నియోజకవర్గంలో మాజీ అధ్యక్షులు మాధవ రెడ్డి, సదానంద్ రెడ్డిలతోపాటు ప్రస్తుత అధ్యక్షుడి వర్గం, కొండా వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు రాష్ట్రస్థాయి నేతలతో టచ్‌లో ఉంటూ రాజకీయం చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతున్నది. మరోవైపు పరిగి నియోజకవర్గంలోనూ గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. పరిగి నియోజకవర్గంలో మాజీ అధ్యక్షుడు ప్రహ్లాద్రావుతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బూనేటి కిరణ్, మిట్ట పరమేశ్వర్ రెడ్డి గ్రూపులున్నాయి. అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలోనూ పటేల్ రవిశంకర్‌తోపాటు రమేశ్ గ్రూపులుగా విడిపోయి రాజకీయం చేస్తున్నారని స్థానికంగా చర్చించుకుంటున్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ సొంత గ్రూపును ఏర్పాటు చేసుకొని రాజకీయం చేస్తున్నారని వినిపిస్తున్నది. కొండా సొంత గ్రూపు నేతలు ఏం చెబితే అదే వాస్తవమని నమ్మి ఇతరులను దూరం చేస్తూ పార్టీలో ఉన్న గ్రూపులకు మించి ఎంపీ గ్రూపు తలనొప్పిగా మారిందని మొదట్నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.
వికారాబాద్‌లో షాద్‌నగర్‌కు చెందిన శ్రీధర్ రెడ్డిని, పరిగి నియోజకవర్గంలో మిట్ట పరమేశ్వర్ రెడ్డిని, తాండూరు నియోజకవర్గంలో రమేశ్‌ను ఎంపీ కొండా గ్రూపుగా ఏర్పాటు చేసుకున్నారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. తన సొంత గ్రూపు నేతలు చెబితే తప్ప జిల్లా అధ్యక్షుడు మరెవరూ చెప్పినా పట్టించుకోకుండా గ్రూపు రాజకీయాలను పెంచుతున్నారని ఆ పార్టీ నేతలు గుసగుస లాడుతున్నారు.