ఇబ్రహీంపట్నం, జూలై 18 : కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ హైవేలోని తూప్రాన్‌పేట్ వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేశారు.
ప్రస్తుతం రాయపోల్ గ్రామంలో రోడ్డు వెడల్పు చేయకపోవడంతో రోడ్లపై పెద్దఎత్తున నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నదని నిరసిస్తూ శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో రోడ్డుపై నిలిచిన నీటిలో గ్రామస్తులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వరినాట్లు వేసి, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు హయాంలో గ్రామీణ రోడ్లను పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. రాయపోల్‌లో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యేను పలుమార్లు కోరినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.